రాజంపేట : తాళ్లపాక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురుడవాహనంపై శ్రీ చెన్నకేశవస్వామి బుధవారం భక్తులకు దర్శనమిచ్చారు. మాడవీధుల్లో స్వామి వారికి గ్రామోత్సవం నిర్వహించారు. దీంతో తాళ్లపాకలో అధ్యాత్మిక వాతవరణం నెలకొంది. కార్యక్రమంలో టీటీడీ ఇన్‌స్పెక్టర్ బాలాజీ, టీటీడీ సిబ్బంది. విజిలెన్స్ సిబ్బంది, తాళ్లపాకకు చెందిన సంఘసేవకుడు ఉద్దండం సుబ్రమణ్యం పాల్గొన్నారు.
నేడు ఒకేవేదికపై శివ, కేశవుల కల్యాణం
గురువారం అన్నమాచార్య ధాన్యమందిరం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన కళ్యాణవేదికపై శివ, కేశవుల కల్యాణోత్సవం నిర్వహించడం ప్రత్యేక విశేషం. శ్రీసిద్దేశ్వరస్వామి, కామాక్షి అమ్మవారితో, శ్రీదేవి, భూదేవిలతో శ్రీ చెన్నకేశవస్వామి కల్యాణం కమనీయంగా నిర్వహించనున్నారు. టీటీడీ అధికారులు అన్ని ఏర్పాటు చేశారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
చాపాడు : మండల పరిధిలోని నక్కలదిన్నే – అనంతపురం గ్రామాల మధ్య రోడ్డుపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తిప్పిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన పామిడి రవి(42) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పామిడి రవి రాత్రి 7 గంటల ప్రాంతంలో బైకులో చాపాడు నుంచి తిప్పిరెడ్డి పల్లెకు వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన పడిపోయిన రవిని స్థానికులు గుర్తించి 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గంటలోపు మృతి చెందాడు. రోడ్డు పక్కన పడిపోయిన రవికి ఏ విధంగా ప్రమాదం జరిగిందని అంశంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రవికి భార్య ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై చిన్న పెద్దయ్య తెలిపారు.
చికిత్స పొందుతూ
గుర్తుతెలియని వ్యక్తి..
ప్రొద్దుటూరు క్రైం : స్థానిక జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అతన్ని సోమవారం 108 అంబులెన్స్ సిబ్బంది జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో అతను మంగళవారం రాత్రి మృతి చెందాడు. మృత దేహాన్ని ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. మృతుడి బంధువులు ఔట్ పోస్టులో సంప్రదించాలని ఇన్‌చార్జి కాశయ్య తెలిపారు.


