విద్యుత్‌ షాక్‌తో లైన్లపైనే పడిపోయిన లైన్‌మెన్‌ | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో లైన్లపైనే పడిపోయిన లైన్‌మెన్‌

Jul 30 2026 4:36 AM | Updated on Jul 30 2026 4:36 AM

మరమ్మతు పనులు చేస్తుండగా

విద్యుత్‌ ప్రవాహం

సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది

ప్రొద్దుటూరు క్రైం : క్షణాల్లో జరిగిన ప్రమాదం ఓ విద్యుత్‌ ఉద్యోగి ప్రాణాలను బలితీసుకునే పరిస్థితి తీసుకొచ్చింది. అయితే అగ్నిమాపక సిబ్బంది సమయస్ఫూర్తితో స్పందించి రక్షించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన బుధవారం సాయంత్రం ప్రొద్దుటూరు పట్టణంలోని పొట్టిపాడు రోడ్డులోని సెయింట్‌ జోసెఫ్‌ స్కూల్‌ సమీపంలో చోటు చేసుకుంది. ఎలక్ట్రికల్‌ అసిస్టెంట్‌ లైన్‌మెన్‌ బి.వీరయ్య బుధవారం విద్యుత్‌ లైన్‌ మరమ్మతు పనులు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌కు గురయ్యారు. దీంతో ఆయన విద్యుత్‌ తీగలపైనే చిక్కుకుపోయి ప్రణాపాయ స్థితిలో వేలాడుతూ కనిపించారు. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అప్పటికే విద్యుత్‌ శాఖ అధికారులు విద్యుత్‌ సరఫరా నిలిపేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ప్రొద్దుటూరు అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. లాడర్‌ సహాయంతో విద్యుత్‌ తీగలపై చిక్కుకుపోయిన వీరయ్యను కిందకు దించి వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇన్‌చార్జి అధికారి వీరన్న ఆధ్వర్యంలో సుదర్శన్‌రెడ్డి, గురుశంకర్‌రెడ్డి, నరేంద్రకుమార్‌, గురుప్రశాంత్‌, భాస్కర్‌లు విద్యుత్‌ స్తంభంపైకి ఎక్కి ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతన్ని కాపాడారు. వీరయ్య ప్రైవేట్‌ ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. అతనికి భుజం, కాలుకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై విద్యుత్‌ శాఖ అధికారులు విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement