కడప సెవెన్‌రోడ్స్ : ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాల నేపథ్యంలో వైఎస్‌ఆర్ కడప జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర కార్యాచరణను అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. కావున రైతులు నిర్భయంగా శాసీ్త్రయ, సహజ సాగు పద్ధతులను అనుసరిస్తూ ప్రభుత్వ సూచనలను పాటించాలని పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో వ్యవసాయ, ఉద్యానవన, ప్రకృతి వ్యవసాయం, పశుసంవర్ధక, సూక్ష్మ సాగునీటి యాజమాన్య శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్.. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనే కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ జిల్లాలకు అవసరమైన మార్గదర్శకాలు జారీ చేస్తోందని, వాటి ప్రకారం జిల్లాలో ఇప్పటికే ముందస్తు చర్యలు ప్రారంభించామని తెలిపారు. రైతులు వదంతులను నమ్మకుండా వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, కృషి విజ్ఞాన కేంద్రాల నిపుణుల సూచనలను పాటించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ నీటి సంరక్షణకు ప్రాధాన్యం, సహజ వ్యవసాయానికి ప్రోత్సాహం, జలధార–జలహారతి కార్యక్రమం వేగవంతం, పశుసంవర్ధక రంగానికీ రక్షణ చర్యలు, రైతులకు భరోసా తదితర అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఏపీ సీఎన్‌ఎఫ్ డీపీఎం ప్రవీణ్ కుమార్, పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీనివాసులు, ఉద్యాన శాఖ ఉపసంచాలకుడు హరిప్రసాద్, ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటరమణ, ఎల్డీఎం జనార్దనం, వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎ.ప్రభాకర్ రెడ్డి, శాస్త్రవేత్త డా. కె.సునీల్ కుమార్, కృషి విజ్ఞాన కేంద్రం కార్యక్రమ సమన్వయకర్త డా. బి.శిల్పకళ, డీఏఏటీ కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఎన్.కృష్ణప్రియతోపాటు వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


