కడప కోటిరెడ్డిసర్కిల్ : పలు రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు రామాలయం వీధికి చెందిన పిన్నం రాజశేఖర్‌ను అరెస్టు చేసినట్లు తిరుపతి రైల్వే సబ్ డివిజన్ డీఎస్‌ఆర్‌పీ శ్రీనివాస ఆచారి తెలిపారు. ఆయన మంగళవారం వివరాలు వెల్లడించారు. పిన్నం రాజశేఖర్ ఈనెల 24వ తేదీన రాయలసీమ ఎక్స్‌ప్రెస్, జూన్ 7, 8, జూలై 21, 22 తేదీల్లో మచిలీపట్నం–ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌లో ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు చోరీకి పాల్పడ్డాడన్నారు. ఈ దొంగతనాలపై తమ పర్యవేక్షణలో రైల్వే సీఐ సుధాకర్‌రెడ్డి సూచనలతో కడప ఎస్‌ఐ సునీల్‌కుమార్‌రెడ్డి, ఆర్‌ఫీఎఫ్ సీఐ కోటేశ్వరరావు, ఎర్రగుంట్ల ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు, సిబ్బంది అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగగించి నిందితుడిని మంగళవారం సాయంత్రం 6 గంటలకు కడప రైల్వేస్టేషన్ రెండవ ఫ్లాట్‌ఫారంపై అరెస్టు చేశామన్నారు. అతని వద్ద నుంచి రూ.5 లక్షల విలువజేసే 13 ల్యాప్‌టాప్‌లు, 6 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. అంతేకాకుండా నిందితుడిపై రాజమండ్రి, విజయవాడ, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు రైల్వే పోలీసుస్టేషన్లలో 20 దొంగతనం కేసులు ఉన్నాయన్నారు. నిందితుడిని అరెస్టు చేయడం, చోరీ సొత్తు రికవరీలో పాల్గొన్న వారిని తిరుపతి రైల్వే సబ్ డివిజన్ అధికారి శ్రీనివాస ఆచారి అభినందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికులు తమ విలువైన వస్తువులను జాగ్రత్తగా సంరక్షించుకోవాలని, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సమీపంలోని రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.


