ఆలోచనకు పదును.. సృజనకు అదును | - | Sakshi
Sakshi News home page

ఆలోచనకు పదును.. సృజనకు అదును

Jul 27 2026 1:24 AM | Updated on Jul 27 2026 1:24 AM

ఆలోచనకు పదును.. సృజనకు అదును

విద్యార్థుల ఉజ్వల భవితకు ఇన్‌స్పైర్‌

సెప్టెంబర్‌ 15 వరకు నమోదుకు గడువు

కడప ఎడ్యుకేషన్‌ : పాఠశాల స్థాయి నుంచే పరిశోధనల పట్ల ఆసక్తి పెంచి వారిని రేపటి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నేషనల్‌ ఇన్నోవేషన్‌ పౌండేషన్‌, కేంద్ర ప్రభుత్వ ముఖ్య లక్ష్యం. విద్యార్థి దశ నుంచే చదువుతోపాటు సైన్స్‌ పట్ల ఆసక్తిని పెంచి ప్రయోగాల వైపు నడిపించాలి... వారి చిట్టి బుర్రలకు పదునుపెట్టి... కొత్త కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాలి. భావి భారత శాస్త్రవేత్తలుగా తయారు చేయాలి. తద్వారా నవ భారతానికి అడుగులు పడాలనే లక్ష్యంలో భాగంగా భారత ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం(డీఎస్‌టీ) ప్రతి ఏటా పాఠశాల ఉన్నతస్థాయి విద్యార్థులకు ఇన్‌స్పైర్‌ మనాక్‌ పేరిట కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించి 2026–27 విద్యా సంవత్సరానికి ఇనన్‌స్పైర్‌ మనాక్‌ అవార్డుల నామినేషన్స్‌ను ఆహ్వానిస్తోంది. వైఎస్సార్‌ జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు సంబంధించిన ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఇందుకు అర్హులు. వీరంతా తమ సైన్స్‌ టీచర్స్‌ను గైడ్‌గా ఏర్పాటు చేసుకుని పరిశోధనలో పాల్గొనాల్సి ఉంటుంది. ప్రతి పాఠశాల నుంచి ఐదు ప్రాజెక్టులు ఎంపిక చేస్తారు.

ఎవరికి అవకాశం..

6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు తమ ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. విద్యార్థి పేరు, తండ్రి పేరు, తరగతి నమోదు చేయాలి. విద్యార్థికి సంబంధించిన బ్యాంకు ఖాతా నంబర్‌, ఆధార్‌కార్డు నంబర్‌ ఎంటర్‌ చేయాలి. విద్యార్థి ప్రాజెక్టు సంక్షిప్తంగా.. రాత పూర్వకంగా పొందుపర్చి సంబంధిత రైటప్‌ ఇన్‌స్పైర్‌ మనాక్‌ యాప్‌లో నమోదు చేయాలి. ప్రాజెక్టు పేరు, శాస్త్ర సాంకేతికతకు సంబంధించిన అంశాలు ఉండేలా చూసుకోవాలి.

ప్రోత్సాహకాలు...

జిల్లాస్థాయిలో ప్రదర్శించిన ప్రాజెక్టుల్లో నుంచి 10 శాతం రాష్ట్రస్థాయికి పంపుతారు, రాష్ట్రస్థాయిలో ఇన్‌స్పైర్‌ ఎగ్జిబిషన్లో నుంచి కూడా 10 శాతం సెలెక్టు చేసి జాతీయస్థాయికి పంపుతారు. అత్యుత్తుమ ప్రాజెక్టుల్లో జిల్లాస్థాయి నుంచి జాతీయస్థాయికి ఎంపికై తే రాష్ట్రపతి భవన్‌ సందర్శనతోపాటు జపాన్‌ దేశానికి వెళ్లే అవకాశం కూడా లభిస్తుంది. అలాగే ప్రాజెక్టులను మరింత అభివృద్ధి చేయడానికి కేంద్ర శాస్త్ర సాంకేతికశాఖ రూ.25 వేలు నిధులు మంజూరు చేస్తుంది. ఈ దరఖాస్తుకు సెప్టెంబర్‌ 15 వరకు గడువు ఉంది.

దరఖాస్తు చేసుకునే విధానం ఇలా...

ఇన్‌స్పైర్‌ అవార్డు మనాక్‌లో పాల్గొనేందుకు విద్యార్థులు ముందుగా www. inspireawards& dst. gov. in వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయాలి. స్కూల్‌ ఆఽథార్టీ ఆప్షన్‌ను ఎంపిక చేయాలి. అందులో న్యూ రిజిస్ట్రేషన్‌ అప్షన్‌ను ఎంపిక చేయాలి. పాఠశాలకు సంబంధించిన వివరాలను పొందు పరిచి సేవ్‌ చేయాలి. సంబంధిత దరఖాస్తు జిల్లా అథారిటీకి చేరుతుంది. ఆమోదించిన తరువాత మనం ఇచ్చిన మొయిల్‌ ఐడీకి యూజర్‌ ఐడీతో కూడిన లింక్‌ వస్తుంది. ఆ ఐడీతో పాస్‌వర్డు క్రియేట్‌ చేయాలి. అనంతరం విద్యార్థుల ప్రాజెక్టు వివరాలను అందులో నమోదు చేయాలి. (లేదా) ఇన్‌స్పైర్‌ మనక్‌ యాప్‌లో విద్యార్థి యొక్క ఆధార్‌నెంబర్‌, బ్యాంకు వివరాలు, పాస్‌పోర్టుసైజ్‌ పోటో ద్వారా స్కూల్‌ లాగిన్‌లో ఓపెన్‌ చేసి ప్రాజెక్టు వివరాలు నమోదు చేయాలి. అది కూడా 100లోపు పదాలు ఉండేటట్లు చూసుకుని రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement