అత్యాశే మోసగాడి అస్త్రం | - | Sakshi
Sakshi News home page

అత్యాశే మోసగాడి అస్త్రం

Jul 27 2026 1:24 AM | Updated on Jul 27 2026 1:24 AM

ప్రొద్దుటూరు క్రైం : ఆశ మనిషిని ముందుకు నడిపిస్తుంది. కానీ దురాశ మాత్రం అగాధంలోకి నెడుతుంది. మార్కెట్‌లో 1 తులం (10 గ్రాములు) బంగారం ధర రూ. 1.40 లక్షలు పైగా పలుకుతున్న సమయంలో.. రూ. లక్షకే ఏకంగా 100 గ్రాముల బంగారం ఇస్తానంటే నమ్మడం అతని అమాయకత్వమా..? లేక దురాశనా..? సులభంగా రూ. లక్షలు సంపాదించాలనే ఆశతో ఓ వ్యక్తి మాటలు నమ్మిన ప్రొద్దుటూరుకు చెందిన రవికుమార్‌ చివరకు రూ. 6.50 లక్షలు కోల్పోయి పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. తక్కువ ధరకు బంగారం ఆశ చూపి రూ. 6.50 లక్షలు కాజేసిన మోసగాడిని వన్‌టౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మార్కెట్‌ ధర కంటే చాలా తక్కువకే బంగారం అందిస్తానని నమ్మబలికి, అసలు బంగారం స్థానంలో నకిలీ కడ్డీని అంటగట్టి భారీ మోసానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సాంకేతిక ఆధారాలతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వద్ద నుంచి 100 గ్రాముల నకిలీ బంగారు కడ్డీ, ఒక ల్యాప్‌టాప్‌, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్‌ వివరాలను ఆదివారం ఎస్‌డీపీఓ కార్యాలయంలో ఏఎస్పీ విభూకృష్ణ మీడియాకు వెల్లడించారు. తిరుపతి జిల్లా పుత్తూరుకు చెందిన కన్నయ్య కొంత కాలంగా తక్కువ ధరకే బంగారు ఇప్పిస్తానంటూ పలువురిని సంప్రదిస్తూ నమ్మకం కలిగించే ప్రయత్నం చేసేవాడు. ప్రొద్దుటూరులోని వసంతపేటకు చెందిన బెల్లాల రవికుమార్‌ ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. అతనికి కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. తన స్నేహితుడైన దుగ్గనపల్లి ప్రసన్న కుమార్‌ ద్వారా రవికుమార్‌ కన్నయ్యను ఆశ్రయించాడు. పుత్తూరు మండలంలోని వినాకపురంలో కన్నయ్య అనే వ్యక్తి ఆయుర్వేద మందులు ఇవ్వడంతో పాటు తక్కువ ధరకే బంగారు తయారు చేసి ఇస్తుంటాడని చెప్పగా ఇరువురు కలిసి గతేడాది డిసెంబర్‌ 7న అక్కడికి వెళ్లారు. అతను రూ. లక్షకే 100 గ్రాముల బంగారు ఇస్తానని చెప్పగా రూ. 5 లక్షలకు బంగారు ఇవ్వమని ఆర్డర్‌ ఇచ్చారు. 20 నుంచి 40 రోజులకు బంగారు సిద్ధంగా ఉంచుతానని కన్నయ్య వారితో అన్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత రవికుమార్‌ పుత్తూరుకు వెళ్లగా బంగారం పూత పూసిన కొన్ని కడ్డీలను అతనికి ఇచ్చిపంపాడు. అనుమానం కలిగిన రవికుమార్‌ కడ్డీల నాణ్యతను పరిశీలించుకోగా నకిలీ బంగారు కడ్డీలని నిర్ధారణ అయింది. దీంతో రవికుమార్‌ నకిలీ బంగారం విషయమై వెంటనే కన్నయ్యకు ఫోన్‌ చేసి అడుగగా రెండు నెలల సమయం ఇస్తే నిజమైన బంగారం ఇస్తానని చెప్పాడు. ఈ క్రమంలోనే అతను రవికుమార్‌ను బెదిరించాడు. దీంతో రవికుమార్‌ ప్రొద్దుటూరు వన్‌టౌన్‌ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు వన్‌టౌన్‌ ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే నిందితుడు కన్నయ్య ప్రొద్దుటూరులోని ఎర్రగుంట్ల బైపాస్‌రోడ్డులో గల వాసవి సర్కిల్‌ వద్ద ఉండగా ఆదివారం ఎస్‌ఐ మదుసూదన్‌రెడ్డి, సిబ్బందితో కలసి అరెస్ట్‌ చేశారు. అతని వద్ద నుంచి బంగారం కోటింగ్‌తో ఉన్న కడ్డీ, ల్యాప్‌టాప్‌, మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు ఏఎస్పీ తెలిపారు. సమావేశంలో వన్‌టౌన్‌ సీఐ టీవీ కొండారెడ్డి పాల్గొన్నారు. ఈ తరహా మోసాలకు సంబంధించి అతను మరెవరినైనా మోసం చేశాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండండి

మార్కెట్‌ ధర కంటే తక్కువకు బంగారం ఇప్పిస్తానని చెప్పే వ్యక్తులను గుడ్డిగా నమ్మి, డబ్బు ఇవ్వరాదని ఏఎస్పీ సూచించారు. బంగారం కొనుగోలు చేసే ముందు దాని స్వచ్ఛతను, తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని, గుర్తింపు పొందిన నగల దుకాణాల్లోనే కొనుగోలు చేయాలన్నారు. అధిక లాభాల ఆశ, ఆకర్షణీయమైన ఆఫర్ల పేరుతో జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉంటే ఇలాంటి ఘటనలను నివారించవచ్చని ఏఎస్పీ స్పష్టం చేశారు. ఈ తరహా వ్యక్తులు ఎవరైనా బజారులో కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

మోసపోయిన ఫొటో గ్రాఫర్‌

నకిలీ బంగారంతో రూ. 6.50 లక్షలు టోకరా

తిరుపతి జిల్లా వాసిని అరెస్ట్‌ చేసిన ప్రొద్దుటూరు వన్‌టౌన్‌ పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement