ప్రగడ కోటయ్య సేవలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

ప్రగడ కోటయ్య సేవలు చిరస్మరణీయం

Jul 27 2026 1:24 AM | Updated on Jul 27 2026 1:24 AM

పరిశ్రమలశాఖ జీఎం చాంద్‌బాషా

కడప సెవెన్‌రోడ్స్‌ : చేనేత కార్మికుల సంక్షేమానికి, హక్కుల సాధనకు కృషి చేసిన మహనీయుడు ప్రజాబంధు ప్రగడ కోటయ్య సేవలు చిరస్మరణీయమని పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ చాంద్‌ బాషా తెలిపారు. కడప కలెక్టరేట్‌లో ఆదివారం ప్రగడ కోటయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత అధికారులు ప్రగడ కోటయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చాంద్‌బాషా మాట్లాడుతూ.. కోటయ్య తన జీవితాంతం చేనేత వర్గాల హక్కుల సాధనకే అంకితం చేశారని తెలిపారు. 1952 నుంచి 1962 వరకు ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభ్యుడిగా, అనంతరం ఏపీ శాసనమండలి సభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా, సుదీర్ఘకాలం ప్రజాప్రతినిధిగా సేవాలందించిన విషయాన్ని గుర్తుచేశారు. శాసనసభలోనూ, పార్లమెంట్‌లోనూ చేనేత రంగానికి ప్రత్యేక బడ్జెట్‌ కేటాయింపులు, మగ్గాలకు ఉచిత విద్యుత్‌, రాయితీల సాధన కోసం ఆయన నిరంతరం గళమెత్తారని వివరించారు. సహకార రంగాన్ని బలోపేతం చేయడంలో, ఆప్కో స్థాపనలో కీలక పాత్ర పోషించారని తెలియజేశారు. సుమారు 16,000 ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేయించడంతో పాటు, చేనేత కార్మికుల సంక్షేమానికై ఆయన చేసిన కృషి స్ఫూర్తిదాయకమన్నారు. చేనేత కార్మిక సంక్షేమమే కాకుండా విద్యాభివృద్ధికి కూడా ఆయన విశేష కృషి చేశారని, చీరాలలో ఆంధ్రకేసరి ప్రకాశం జూనియర్‌ కళాశాల, ఎడ్యుకేషనల్‌ సొసైటీని స్థాపించి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేశారని పేర్కొన్నారు. అనంతరం జిల్లా చేనేత, జౌళి శాఖాధికారి అహ్మద్‌ మొహిద్దిన్‌ మాట్లాడుతూ ప్రగడ కోటయ్య సేవలను కొనియాడారు. సమావేశంలో పలువురు ప్రస్తావించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని తెలియజేశారు. చేనేత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్న పలువురిని సన్మానించారు. కార్యక్రమంలో స్టెప్‌ మేనేజర్‌ సుబ్బరాయుడు, జాతీయ చేనేత ఐక్య వేదిక ప్రధాన కార్యదర్శి అవ్వారు మల్లికార్జున, పద్మశాలి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మాసా కోదండరాం, జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శ్రీ జల్లి కొండయ్య, చేనేతజౌళి శాఖ డెవలప్మెంట్‌ అధికారి సత్యబాబు, అసిస్టెంట్‌ డెవలప్మెంట్‌ అధికారి శ్రీ శేషగిరి రావు, వివిధ చేనేత సొసైటీల అధ్యక్షులు, సభ్యులు, చేనేత సంఘాల ప్రతినిధులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement