కడప కార్పొరేషన్: ఐక్యతతోనే రాజ్యాధికారంలో భాగస్వామ్యం సాధ్యమవుతుందని మాలల సంక్షేమ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కోట్ల గంగాధర్, మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లెల వెంకటరావు అన్నారు. ఆదివారం కడపలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ భవన్‌లో మాలల సంక్షేమ ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాయలసీమలోని మాల సంఘాల ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ముందుగా మల్లెల వెంకట్రావ్ మాట్లాడుతూ మాలలు ఐక్యంగా లేకపోతే దోపిడీ పార్టీల జెండాలు మోసే బానిసలుగా మారుతామని, ఆ పార్టీలకు ఓట్లు వేసే వేసే రబ్బరు స్టాంపులుగా మిగిలిపోతామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంఘాలుగా ఉన్న మాలలు అందరు కూడా ఐక్యతతో మన పిల్లల భవిష్యత్తు కోసం సామాజిక అభివృద్ధి కోసం ఒకే గొంతుకగా మారాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో మతోన్మాదం పెరిగిపోతుందని దీనిని అడ్డుకోకపోతే అంటరానితనం అస్పృశ్యతను పూర్వపు కాలంలో ఎదుర్కొన్న విధంగా మళ్లీ తీసుకొచ్చే ప్రయత్నాలను ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ కూటమి ప్రభుత్వాలు చేస్తున్నాయన్నారు. అంబేడ్కర్ ఇచ్చిన హక్కులను, అవకాశాలను సాధించేందుకు కలిసి ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. మాలల ఐక్యం కోసం మాల మహాసభను రద్దు చేసుకోవడానికి అయినా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అనంతరం కోట్ల గంగాధర్ మాట్లాడుతూ మే 25 నుంచి ప్రారంభించిన మాలల ఐక్యత యాత్రలో మాలలు ఏకం కావాలని కోరారు. ఆ దిశగా మన ప్రయాణం సాగడం కోసం మాత్రమే రాయలసీమలో మాలల ముఖ్య నాయకులు సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో మాల గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కడప జిల్లా సెక్రెటరీ అనిల్ కుమార్, ఏపీఎస్‌ఆర్టీసీ సీనియర్ అసిస్టెంట్ జోష్మ, ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు దేవదత్తం, సుభాష్, బాల ఓబయ్య, స్వతంత్ర బాబు, వసంత్ శుభమంచి, శ్రీనివాసులు, సుబ్బరాయుడు, గుత్తి ఓబులేష్, రాజేష్ జయప్రకాష్, సంపత్ కుమార్ మాల మహాసేన, పెంచలయ్య, ముత్యాలు, సుగమంచి శ్రీనివాసులు, రాయలసీమ నాలుగు జిల్లాల నుంచి ముఖ్యమైన నాయకులు హాజరయ్యారు.


