● గురివిరెడ్డికి తీవ్రగాయాలు..
కర్నూలుకు తరలింపు
చాపాడు : చాపాడు మండలం లక్ష్మీపేట గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ వర్గీయుడు వరికూటి గురివిరెడ్డి అనే వ్యక్తిపై ఆదివారం లక్ష్మీపేట సమీపంలోని వీరభద్రాపురానికి చెందిన టీడీపీ వర్గీయులు బద్వేలి జగన్నాథ్ రెడ్డి, బద్వేలి మణికంఠ రెడ్డి, బద్వేలి పార్వతి దేవి, భూమిరెడ్డి చంద్ర ఓబుళరెడ్డి, మాడెం రామకృష్ణారెడ్డి, ఉప్పలూరు మహేశ్వరరెడ్డి కత్తులు, కట్టెలు, రాడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. తలకు తీవ్ర గాయమైన గురివిరెడ్డిని ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వైద్యుల సూచన మేరకు కర్నూలుకు తీసుకెళ్లా రు. గురివిరెడ్డి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు ... వీరభద్రపురం సమీపంలోని కేసీ కాలువ వద్ద గల గురివిరెడ్డి పొలంలో రెండు రోజుల క్రితం పసుపు విత్తనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం పొలం వద్దకు వ్యవసాయ బోరు నుంచి నీరు పెట్టుకునేందుకు వెళ్లాడు. బద్వేలి పార్వతి ఇంకా పలువురు మహిళలు పొలం వద్దకు వచ్చి గతంలో ఇరువర్గాల మధ్య ఉన్న సమస్యలపై గురివిరెడ్డి కుటుంబీకులతో గొడవకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు సర్దుబాటు చేయడంతో ఇరువర్గాల వారు వెళ్లిపోయారు. మధ్యాహ్నం పొలం వద్ద వ్యవసాయ పనులకు గురివిరెడ్డి ముందు వెళ్లగా , తర్వాత భార్య రామలక్ష్మి, కోడలు వరలక్ష్మి వెళుతున్నారు. అప్పటికే పొలం వద్ద మాటు వేసి ఉన్న బద్వేలి జగన్నాథ్ రెడ్డి కుటుంబీకులు, బంధువులు గురివిరెడ్డిపై కత్తులు, కట్టెలు, రాడ్లతో దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న ఇద్దరు యువకులు విడిపించేందుకు ప్రయత్నించగా రామలక్ష్మి, వరలక్ష్మి అక్కడికి చేరుకున్నారు. గురివిరెడ్డి తలకు తీవ్ర గాయమై పడిపోయాడు. బాధితుడు వివరాల మేరకు వరలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చిన్నపెద్దయ్య తెలిపారు.


