ప్రొద్దుటూరు క్రైం : స్థానిక రెడ్డిగారివీధిలో బంగారు గొలుసు చోరీ చేసిన కేసులో నిందితుడిని వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి చోరీకి గురైన బంగారు తాళిబొట్టు సరుడును స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ వివరాలను వన్‌టౌన్ సీఐ కొండారెడ్డి గురువారం సాయంత్రం మీడియాకు తెలిపారు. బద్వేలి గంగమ్మ రామేశ్వరంలోని రెడ్డిగారి వీధిలో నివాసం ఉంటున్నారు. ఆమెకు ఎవ్వరు లేకపోవడంతో ఒక్కరే ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమె అదే వీధిలోని మరో అద్దె ఇంట్లోకి మారేందుకు ఇంట్లోని సామాన్లు కట్టి పెట్టారు. అయితే వాటిని తరలించడానికి తన చెల్లెలు కుమారుడైన బల్ల దస్తగిరిరెడ్డిని పిలిపించారు. ఈ నెల 12న ఇంట్లోని సామాన్లను తరలించే క్రమంలో బీరువాలో ఉన్న 20.03 గ్రాముల బంగారు చైన్‌ను అతను దొంగలించాడు. నాలుగు రోజుల తర్వాత గంగమ్మ బీరువా చూడగా బంగారు గొలుసు కనిపించలేదు. దస్తగిరిరెడ్డిని పిలిచి అడుగగా తనకు తెలియదని చెప్పాడు. దీంతో ఆమె బుధవారం రాత్రి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వన్‌టౌన్ ఎస్‌ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో నిందితుడు బల్ల దస్తగిరిరెడ్డి గురువారం బంగారు చైన్‌ను విక్రయించడానికి బంగారు అంగళ్ల వీధికి వెళ్లగా ఎస్‌ఐ శ్రీనివాసులు సిబ్బందితో కలిసి వెళ్లి అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి బంగారు చైన్ స్వాఽధీనం చేసుకున్నారు.
ఇటుకల ఫ్యాక్టరీ యజమాని ఆత్మహత్య
ప్రొద్దుటూరు క్రైం : స్థానిక రామేశ్వరం రోడ్డులో పఠాన్ నాయబ్‌రసూల్ (40) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నాయబ్‌రసూల్ కొన్నేళ్లుగా బైపాస్ రోడ్డులో సిమెంట్ ఇటుకల ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నాడు. ఇటీవల అతను అధికంగా అప్పుడు చేశాడు. డబ్బు ఇవ్వమని రుణదాతలు ఒత్తిడి చేయసాగారు. ఈ క్రమంలో అతను గురువారం తన ఇటుకల ఫ్యాక్టరీ పక్కన ఉన్న గదిలోకి వెళ్లి తాడుతో ఉరేసుకున్నాడు. కూలీలు గమనించి అతన్ని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యుడు నిర్ధారించాడు. తల్లి ఫాతిమా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపారు.


