యువకుడి దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

యువకుడి దారుణ హత్య

Jul 24 2026 2:09 AM | Updated on Jul 24 2026 2:09 AM

మైదుకూరు : మైదుకూరు మండలం గంజికుంట పంచాయతీ పరిధిలోని బోంచేనుపల్లె వద్ద యెన్నం వెంకటేశ్వర్లు అలియాస్‌ ఏసుబాబు అనే 19 ఏళ్ల యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బుధవారం రాత్రి జరిగినట్టుగా భావిస్తున్న ఈ సంఘటనలో హత్యకు పాల్పడిన వారు యువకుని తలపై రాళ్లతో మోదడంతో రక్తగాయాలై మృతి చెందాడు. బోంచేనుపల్లెకు చెందిన యెన్నం సుబ్బారావు, జ్యోతిల ఒక్కగానొక్క కుమారుడైన వెంకటేశ్వర్లు పదో తరగతి వరకు చదివి మానేశాడు. బేల్దారి పనులకు వెళుతుంటాడు. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో తాను వనిపెంటకు వెళుతున్నట్టు తల్లిదండ్రులకు చెప్పాడు. రాత్రి 10 గంటలైనా కుమారుడు ఇంటికి రాకపోవడంతో తండ్రి సుబ్బారావు వెంకటేశ్వర్లుకు ఫోన్‌ చేశాడు. అతని వద్ద ఉన్న రెండు ఫోన్‌ నంబర్లకు ఫోన్‌ చేయగా రింగ్‌ అవుతున్నా ఫోన్‌ ఎత్తలేదు. ఆందోళనతో చుట్టుపక్కల వాకబు చేశారు. గురువారం ఉదయం గ్రామానికి ఉత్తరం దిక్కున కిలోమీటర్‌ దూరంలో నివాసాలు లేని గంజికుంట జగనన్న కాలనీ ఇళ్ల మధ్య వెంకటేశ్వర్లు మృతదేహం ఉన్నట్టు తెలిసిన వారు చెప్పారు. అక్కడికి చేరుకున్న యువకుని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. మైదుకూరు అర్బన్‌ సీఐ కె.రమణారెడ్డి, ఎస్‌ఐ కత్తి వెంకటరమణ, సిబ్బంది అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతుని తల్లిదండ్రులను, గ్రామస్తులను విచారించారు. యువకుని దుస్తుల్లో ఉన్న సెల్‌ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహం వద్ద రక్తం అంటిన ఒక కొండ రాయిని, శరీరాన్ని ఈడ్చిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. వేలి ముద్రలు నిపుణులు సంఘటన స్థలంలో ఆధారాల కోసం పరిశీలించారు. పోలీసులు జాగిలాన్ని కూడా రప్పించారు. తన కుమారుడు ఫోన్‌లో ఆడ పిల్లలతో మాట్లాడుతుంటాడని ఎవరైనా ఆడ పిల్ల తల్లిదండ్రులు కానీ ఇంకెవరైనా తన కుమారుడిని హత్య చేసి ఉంటారని యువకుని తండ్రి సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ మేరకు దర్యాప్తు చేపట్టామని సీఐ రమణారెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement