●ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు | - | Sakshi
Sakshi News home page

●ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు

Jul 23 2026 12:48 AM | Updated on Jul 23 2026 12:48 AM

●ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు

కడప సిటీ: ఈ ఏడాది ఎల్‌నినో వాతావరణ మార్పుల ప్రభావం వ్యవసాయ రంగాన్నే కాకుండా జిల్లాలో ఉన్న ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను కూడా నిలువునా ముంచేస్తోంది. ఒకవైపు వరుణ దేవుడు కరుణించకపోవడంతో సాగుకాక వ్యవసాయం దెబ్బతిని ప్రజలు దిగులు చెందుతుంటే, మరోవైపు సాగునీటి ప్రాజెక్టులపై ఈ ప్రభావం మెండుగా పడుతోంది. జులై నెల ముగుస్తున్నప్పటికీ జిల్లాలో ఆశించిన స్థాయిలో భారీ వర్షాలు కురవడం లేదు. కేవలం నామమాత్రపు తుంపర వానలతోనే సరిపెడుతుండటంతో ప్రాజెక్టులకు నీరు చేరేందుకు ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. భారీ వర్షాలు కురిసి వంకలు, నదులు ఉరకలేసి ప్రవహిస్తే తప్ప ప్రాజెక్టుల్లోలోకి నీరు చేరే పరిస్థితి ప్రస్తుతానికి కనిపించడం లేదు.

మరో ఆరు నెలల గండం..

తాగునీటికి ముంచుకొస్తున్న ముప్పు!

వాతావరణ శాస్త్రవేత్తలు ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం.. వచ్చే ఏడాది మరో ఆరు నెలల వరకు ఈ ఎల్‌నినో ప్రభావం ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. దీనివల్ల రాబోయే రోజుల్లో కూడా వర్షాలు అంతంత మాత్రమే కురుస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాగునీరు దేవుడెరుగు, భవిష్యత్తులో కనీసం తాగడానికి గుక్కెడు నీరు కూడా దొరకని భయానక తాగునీటి ఇక్కట్లు ఎదురయ్యే పరిస్థితి లేకపోలేదని పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తోంది.

రిజర్వాయర్లలో పడిపోతున్న నీటి మట్టం.. రైతన్నల గుబులు!

జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులలో రోజురోజుకు నీటి మట్టాలు వేగంగా తగ్గుతూ వస్తుండటంతో రైతాంగం తీవ్ర ఆందోళనలో మునిగిపోయింది. ఖరీఫ్‌ సీజన్‌ చేజారిపోతుండటం, పెట్టిన పెట్టుబడులు మట్టిపాలవుతాయేమోనని అన్నదాతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వాతావరణ మార్పుల ధాటికి అటు తాగునీరు, ఇటు సాగునీరు అందక జిల్లా జనం దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఇప్పటికై నా ప్రత్యామ్నాయ నీటి నిల్వ, సరఫరా ప్రణాళికలపై అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన దృష్టి సారించాలని కోరుతున్నారు.

ఎల్‌నినో దెబ్బకు సగానికి పడిపోయిన జలాశయాల నీటి నిల్వలు

వ్యవసాయం అతలాకుతలం

జులై ముగుస్తున్నా

తుంపర్లకే పరిమితమైన వానలు

మరో ఆరు నెలల పాటు ఇదే ప్రభావం ఉంటుందన్న వాతావరణ శాస్త్రవేత్తలు

మొత్తం సామర్థ్యం 82 టీఎంసీలు అయితే.. ప్రస్తుతం ఉంది 42 టీఎంసీలే!

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు రాక ప్రాజెక్టుల నీటిమట్టాలు తగ్గుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రాజెక్టుల నీటిమట్టం మరింత లోతుకు పోయే అవకాశం ఉంది. అయినప్పటికీ పరిశ్రమలకు, తాగునీటికి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నాం. ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు జిల్లాలోని ప్రాజెక్టుల నీటి నిల్వల సమాచారాన్ని తెలియజేస్తున్నాం.

– బాలచంద్రారెడ్డి, ప్రాజెక్టుల సీఈ, కడప.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement