కడప రూరల్ : బజార్లలో జనాలు లేక వెలవెలబోతున్నాయి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా వ్యాపారాలు కుంటుపడ్డాయి. పంటలకు గిట్టుబాటు దక్కకపోవడం, సంక్షేమ పథకాల ఆదరణ లేక జనాల వద్ద డబ్బులు చేతులు మారడం లేదు. కొనుగోలు శక్తి క్షీణించి ఏమీ కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఆ ప్రభావం ప్రధానంగా వ్యాపార రంగంపై పడింది.
పడకేసిన సంక్షేమం..
పాలన బాగుంటే ప్రజలు నూతనోత్సాహంతో ఉంటారు. ఆర్థికంగా ముందడుగు వేస్తారు. సంక్షేమం అటకెక్కితో ఆ ప్రభావం జనాలపై పడుతుంది. అదే జరిగేతే కొనేవారు లేక వ్యాపారం కుదేలవుతుంది. రెండేళ్ల కూటమి పాలనలో ఇదే జరుగుతోంది. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ఏ కోశానా సంక్షేమం మచ్చుకై నా కనిపించలేదు. అలాగే వ్యవసాయం, భవన నిర్మాణ పనులు నెమ్మదించాయి. దీంతో కూలీల పరిస్ధితి దినదిన గండంగా మారింది. ఆఖరికి కడుపు నింపుకోవడానికి ఏమీ కొనలేని పరిస్ధితి దాపురించింది.
మనకు ప్రధాన ఆర్ధిక వనరు వ్యవసాయం
ప్రస్తుత టీడీపీ కూటమి పాలనలో రైతన్నకు ‘వ్యయం’పెరిగింది, ప్రభుత్వ ‘సాయం’కొరవడింది. పాలకులు కనీసం గిట్టుబాటు ధరలు కల్పించకపోవడంతో చీనీ, అరటి తదిర పంటలు సాగు చేసిన రైతులు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెట్టుబడి డబ్బులు కూడా రాకపోవడంతో ఆర్ధికంగా చితికిపోయారు. తెచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడ్డారు. ఆ ప్రభావం కూడా వ్యాపార రంగంపై పడింది.
రియల్ ఎస్టేట్ ఢమాల్..
ఏదో ఒక చోట స్ధలం ఉంటే దాన్ని అమ్ముకొని జీవనం సాగించాలని ఎంతో మంది భావిస్తారు. అలాగే ఎంతో కొంత స్తోమత కలిగిన వారు 2–3 సెంట్లైనా స్థలం కొని ఇంటిని నిర్మించుకోవాలని భావిస్తారు. గడిచిన రెండేళ్ల నుంచి భూముల క్రయ విక్రయాలు పూర్తిగా మందగించాయి. వైఎస్సార్‌సీపీ పాలనలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి ఉరకలేసింది. దీంతో స్ధలాలకు మంచి ధరలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ పాలనలో అభివృద్ధి కనిపించలేదు. దీంతో స్థలాల ధరలు నేలను తాకాయి. ఈ ప్రభావం కూడా వ్యాపారాలపై తీవ్రంగా పడింది. చాలా మంది వద్ద స్ధలాల రూపంలో ఆస్తులు ఉన్నాయి. డబ్బులు చేతిలో ఆడడం లేదు.
పండుగలా వైఎస్సార్‌సీపీ పాలన..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజారంజక పాలన సాగించారు. అన్ని వర్గాలకు మేలు కలిగేలా ‘నవరత్నాలు’ లాంటి పఽథకాలను అమలు చేశారు. వైఎస్సార్ రైతు భరోసా, జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత, ఆసరా, జగనన్న విద్యా దీవెన, వైఎస్సార్ వాహన మిత్ర, జగనన్న తోడు, వైఎస్సార్ నేతన్న నేస్తం తదితర పధకాలను విజయవంతంగా అమలు చేశారు. దీంతో ప్రజలు ఇతరుల సహాయం లేకుండా ప్రభుత్వ సహకారంతో సగర్వంగా, ఆర్థ్ధికంగా ఎదిగారు. దీంతో ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది. ఫలితంగా వ్యాపారాలు సంతోషంగా సాగాయి.


