ప్రొద్దుటూరు క్రైం : వాళ్లిద్దరూ ఓ హత్య కేసులో ప్రధాన నిందితులు. పరారీలో ఉన్నారు. పోలీసుల బారి నుంచి తప్పించుకునేందుకు ఫోన్లు స్విచ్ఛాఫ్ చేశారు.. ఉన్న ఊరును వదిలిపెట్టి రోజుకో ప్రాంతంలో తిరగసాగారు.. ఫోన్లు ఆఫ్ చేసినా ఇన్‌స్టాగ్రా మ్‌ను చూడకుండా ఉండలేకపోయారు. ఆ వ్యామోహమే వారిని పోలీసులకు పట్టించింది. హత్య కేసులో మూడు నెలల నుంచి పోలీసులకు దొరక్కుండా ముప్పుతిప్పలు పెడుతూ వచ్చిన ఇద్దరు బీహారీలను ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ వివరాలను ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూకృష్ణ సోమవారం మీడియాకు తెలిపారు. బీహార్ రాష్ట్రంలోని పాట్నా జిల్లా, బిపూర్ తాలుకా, లోడిపూర్ గ్రామానికి చెందిన మున్నా కుమార్ (33) మోడంపల్లె సమీపంలోని ఓ డెయిరీ ఫారంలో పని చేసేవాడు. ఈ క్రమంలో అతను ఈ ఏడాది ఏప్రిల్ 7న రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుని మామ రామ్ పరమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఘటనా స్థలంలోని మున్నా కుమార్ మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు అతని మెడపై తాడుతో గొంతుకు బిగించిన ఆనవాళ్లు ఉండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. బీహార్ రాష్ట్రంలోని అదే ప్రాంతానికి చెందిన దీపుకుమార్, బిర్జుకుమార్‌లు కూడా మృతుడు పని చేస్తున్న డెయిరీ ఫారంలోనే పని చేస్తున్నారు. అయితే మున్నాకుమార్ మృతి ఘటన తర్వాత వాళ్లిద్దరూ కనిపించలేదు. దీంతో పోలీసులు వారిని అనుమానితులుగా ఈ కేసులో చేర్చారు. పోస్టుమార్టం అనంతరం వైద్య నివేదికల ఆధారంగా మున్నాకుమార్‌ను తాడుతో గొంతు బిగించి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితులు ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకొని మూడు నెలలుగా పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నారు.
ఇన్‌స్ట్రాగామ్ పిచ్చితో పోలీసులకు చిక్కి..
హత్య కేసులోని నిందితులు వాళ్ల నంబర్లతో ఉన్న ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసినా..ఇన్‌స్టాగ్రామ్‌ను చూడకుండా ఉండలేకపోయారు. రీళ్ల పిచ్చితో తరచూ ఇన్‌స్టా ఐడీలో యాక్టివ్‌గా ఉండసాగారు.సెల్‌ఫోన్ లొకేషన్లు, రైల్వేస్టేషన్లలో నిందితుల కదిలికలపై ఆరా తీయడం.. ఇలా ఎన్ని విధాలుగా ప్రయత్నించినా నిందితులైన బీహారీలను పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ క్రమంలోనే వాళ్లలో ఒకరి ఇన్‌స్ట్రాగామ్ ఐడీని పోలీసులు గుర్తించారు. అతని ఇన్‌స్టా ఐడీ తరచూ యాక్టివ్‌గా ఉండటంతో లొకేషన్, ఇతర టెక్నాలజీ ఆధారంగా అతని కదలికలను గుర్తించారు. ఈ క్రమంలోనే బీహార్‌కు చెందిన హత్య కేసులోని నిందితులు దీపుకుమార్, బిర్జుకుమార్‌లు ప్రొద్దుటూరు శివారులోని రెండుకుళాయిల సమీపంలో ఉండగా సోమవారం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆర్థిక లావాదేవీల కారణంగానే
మున్నా కుమార్ హత్య
ఆర్థిక లావాదేవీల్లో వచ్చిన మనస్పర్థల కారణంగానే మున్నాకుమార్‌ను హత్య చేసినట్లు పట్టుబడిన నిందితులు దీపుకుమార్, బిర్జుకుమార్‌లు పోలీసుల వద్ద అంగీకరించారు. నైలాన్ తాడుతో అతని గొంతుకు బిగించి హత్య చేసి అక్కడి నుంచి పరారైనట్లు తెలిపారు. నిందితుల కోసం రూరల్ సీఐ నాగభూషణ్, ఎస్‌ఐ శ్రీకాంత్‌ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు హైదరాబాద్, విజయవాడ, బీహార్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో వారు ప్రొద్దుటూరులోనే పట్టుబడ్డారు. రూరల్ సీఐ నాగభూషణ్, ఎస్‌ఐ శ్రీకాంత్ సిబ్బందిని ఏఎస్పీ విభూకృష్ణ అభినందించారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలిస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు.
మూడు నెలల నాటి హత్య కేసులో..
ఇద్దరు బీహారీలు అరెస్ట్


