మైదుకూరు : బస్సులో వాకిలి వద్ద ఫుట్ బోర్డుపై నిలబడవద్దని చెప్పినందుకు ఆర్టీసీ కండక్టర్‌పై మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు దాడి చేసిన సంఘటన సోమవారం సాయంత్రం మైదుకూరు మండలం ముదిరెడ్డిపల్లె వద్ద జరిగింది. బస్సు కండక్టర్ ఎన్‌వీ నరసింహులు, డ్రైవర్ చైతన్య తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మైదుకూరు డిపోకు చెందిన కడప – పోరుమామిళ్ల సర్వీసు ఆర్టీసీ అద్దె బస్సు సోమవారం సాయంత్రం 4 గంటలకు మైదుకూరు నుంచి పోరుమామిళ్లకు బయల్దేరింది. బ్రహ్మంగారిమఠం మండలం లింగందిన్నెపల్లెకు చెందిన ఇద్దరు యువకులు మైదుకూరులో బస్సు ఎక్కారు. వారు ఫుట్ బోర్డుపై నిలబడి ఉండటంతో కండక్టర్ నరసింహులు వారిని బస్సులోపలికి రమ్మని చెప్పారు. వారు వినకపోవడంతో ప్రయాణికులు కూడా కలుగజేసుకోని మందలించారు. మద్యం మత్తులో ఉన్న ఆ యువకులు టికెట్ తీసుకున్నాం.. ఎక్కడైనా నిలబడతాం అంటూ కండక్టర్‌తో వాగ్వాదానికి దిగడంతో భూమాయపల్లె వద్ద వారిని కండక్టర్ దించి వేశారు. తమ టికెట్ డబ్బులు వాపస్ ఇవ్వాలని వారు వాదులాడారు. టికెట్ కొట్టాక డబ్బులు ఎలా ఇస్తామని కండక్టర్ చెప్పడంతో ఇద్దరు యువకులు కోపంతో వెళ్లిపోయారు. మైదుకూరుకు చెందిన తమ స్నేహితున్ని పిలిపించుకుని ఒకే బైక్‌లో ముగ్గురూ ముదిరెడ్డిపల్లె ఎస్సీ కాలనీ సమీపంలో క్రాస్ చేసి బస్సుకు అడ్డంగా బైక్‌ను ఆపారు. బస్సులోకి చొరబడి కండర్ నరసింహులుపై దాడి చేసి కొట్టారు. డ్రైవర్ చైతన్య, ప్రయాణికులు విడిపించారు. ముగ్గురు యువకులు అక్కడి నుంచి బైక్‌పై వెళ్లి అంబవరం వద్ద గుంపును పోగేసి బస్సును అడ్డగించారు. యువకులను ఎందుకు దించారని గుంపులోని వారందరూ కండక్టర్‌ను నిలదీశారు. వారు కండక్టర్, డ్రైవర్‌ను తిడుతూ వాగ్వాదానికి దిగడంతో డ్రైవర్ చైతన్య 100కు డయల్ చేశారు. వారు గొడవ పెట్టుకోవడంతో ప్రయాణికులను వేరే బస్సు ఎక్కించి పంపారు. బ్రహ్మంగారిమఠం పోలీసులు అక్కడికి చేరుకోగా ముగ్గురు యువకులతో పాటు గుంపులోని వారంతా వెళ్లిపోయారు. ముఖం, ఛాతిపై రక్తగాయాలతో ఉన్న కండక్టర్ నరసింహులును బ్రహ్మంగారిమఠం ఆస్పత్రికి తరలించారు. అక్కడి పోలీసులకు కండక్టర్ నరసింహులు ముగ్గురు యువకులపై ఫిర్యాదు చేశారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆయనను ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విధి నిర్వహణలో ఉన్న కండక్టర్ నరసింహులుపై దాడి చేయడాన్ని మైదుకూరు డిపోకు చెందిన నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ అధ్యక్షుడు వీఎస్ రాయుడు, చైర్మన్ ఎం.శంకర్, కారదర్శి బీఎస్ రెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.


