ప్రొద్దుటూరు క్రైం : పూడ్చిన మృతదేహానికి రూరల్ పోలీసులు రీ పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధిలోని దొరసానిపల్లెకు చెందిన కరిచిన్నుగాళ్ల చెన్నయ్య (46) అదే గ్రామంలోని ఆముదం నూనె తయారీ కేంద్రంలో రోజువారి కూలి పనికి వెళ్తుంటాడు. ఈ క్రమంలో ఈ నెల 3న అతను మిల్లులో పనికి వెళ్లాడు. పని చేస్తున్న సమయంలో చెన్నయ్య కింద పడ్డాడని, ఆస్పత్రికి తీసుకొని వెళ్తున్నట్లు మిల్లు యజమాని చెన్నయ్య కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యుడు పరీక్షించి అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించాడు. గుండెపోటుగా భావించి చెన్నయ్య మృతదేహానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ క్రమంలో తన భర్త మిల్లులో విద్యుత్ షాక్‌తో చనిపోయాడని ఇటీవల తెలియడంతో చెన్నయ్య భార్య లక్ష్మీదేవి రూరల్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రూరల్ పోలీసులు ఆముదం మిల్లులోని సీసీ కెమెరాలను పరిశీలించగా చెన్నయ్య పని చేస్తున్న సమయంలో ఇనుప కడ్డీని తగలి విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు నిర్ధారణ అయింది. దీంతో మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేశారు. సోమవారం మృతదేహాన్ని వెలికి తీసి తహశీల్దార్ సమక్షంలో వైద్యులు రీ పోస్టుమార్టం నిర్వహించారు.


