జమ్మలమడుగు : పర్యాటక కేంద్రమైన గండికోటలో సినిమా షూటింగ్ సందడి నెలకొంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో నిర్మించే హైందవ సినిమాను పర్యాటక కేంద్రమైన గండికోటలో 15 రోజులపాటు చిత్రీకరించనున్నారు. ఇందులో భాగంగా ఆదివారం మాధవరాయ స్వామి ఆలయంలో సుమారు 1000 నుంచి 1500 మంది చుట్టుపక్కల గ్రామాల ప్రజలను రప్పించి జాతర సన్నివేశాలను చిత్రీకరించారు. హీరో బెల్లం కొండ శ్రీనివాస్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నాలుగు దశాబ్దాల కాలం నాటి మహావిష్ణు ఆలయ రక్షకుడిగా హీరో నటిస్తున్నాడు. మొదటి రోజు ఆలయ ముఖద్వారం వద్ద బ్రాహ్మణులతో హోమం నిర్వహించే సన్నివేశాలను చిత్రీకరించారు. షూటింగ్‌లో ప్రముఖ నటులు తనికెళ్లభరణి, గెటప్‌శ్రీను, దేవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. త్వరలో హీరో శ్రీనివాస్ ఈ షూటింగ్‌లో పాల్గొంటారని చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు.


