మీ ఇంట్లో ఊడిగం చేస్తా | - | Sakshi
Sakshi News home page

మీ ఇంట్లో ఊడిగం చేస్తా

Jul 20 2026 1:26 AM | Updated on Jul 20 2026 1:26 AM

మీ ఇంట్లో ఊడిగం చేస్తా

ప్రొద్దుటూరులో పారిశుధ్యం బాగుందంటే

కాదని ప్రజలు చెబితే మా ఇంట్లో చేస్తారా

స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌

పట్టాభిరాంకు రాచమల్లు సవాల్‌

ప్రొద్దుటూరు : గత రెండేళ్ల మీ ప్రభుత్వంలో ప్రొద్దుటూరులో పారిశుధ్యం గతం కంటే మెరుగుపడిందని నిరూపిస్తే తాను మీ ఇంట్లో ఈ మూడేళ్లు ఊడిగం చేస్తానని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ప్రజల వద్దకు వెళ్లినప్పుడు గత ప్రభుత్వం కంటే పారిశుధ్య పరిస్థితి అధ్వానంగా ఉందని చెబితే అలాగే మీరు మా ఇంట్లో పని చేయడానికి సిద్ధమా అని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభిరాంకు రాచమల్లు సవాల్‌ విసిరారు. ఆయన ఆదివారం ప్రొద్దుటూరులోని తన క్యాంప్‌ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రెండు రోజుల క్రితం ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి వచ్చిన పట్టాభిరాం తమ ప్రభుత్వంలో పారిశుధ్యం మునుపటికంటే మెరుగుపడిందని డప్పులు కొట్టుకున్నారన్నారు. ఇదంతా చంద్రబాబు ప్రభుత్వం ఘన కీర్తి అని చెప్పుకున్నారని తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పారిశుధ్యాన్ని మెరుగుపరిచామని, ఇప్పుడు వీధుల్లో దుర్గంధం వస్తోందని, వర్షం వస్తే మురికి నీరు రోడ్లపై తాండవిస్తోందని అన్నారు.

మీది వెన్నుపోటు పార్టీ

తెలుగుదేశం పార్టీని స్థాపించింది మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అని రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ఆయనకు వెన్నుపోటు పొడిచి ఆయన స్థాపించిన పార్టీని లాక్కున్నది మీ నాయకుడు చంద్రబాబు కాదా అని పట్టాభిని ప్రశ్నించారు. తండ్రి రాజశేఖరరెడ్డి మరణానంతరం ఓదార్పు యాత్రకు అంగీకరించకపోవడంతో కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఎదిరించిన గొప్ప నాయకుడు జగన్‌ అని అన్నారు. 16 నెలలు జైలు జీవితం గడిపి సొంత పార్టీని స్థాపించి తొలి మారు 67 స్థానాలను గెలుచుకున్నారన్నారు. 25 మంది ఎమ్మెల్యేలను దొడ్లో పశువుల్లా మీరు కొనుగోలు చేసినా జగన్‌ జంకలేదన్నారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో 151 స్థానాల్లో పార్టీని గెలిపించారన్నారు. ఆయనది గొడ్డలి పార్టీ అని మీరంటే సరిపోతుందా అన్నారు. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. మీ ఏబీఎన్‌ రాధాకృష్ణను అడిగితే జగన్‌ ధైర్యం ఏపాటిదో చెబుతారన్నారు. ఐదేళ్లలో రెండేళ్లు కరోనా వచ్చినా జగన్‌ జనరంజక పాలనను అందించారన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీతోపాటు వామపక్ష పార్టీలను కలుపుకొని గత ఎన్నికల్లో పోటీ చేశారని, కాంగ్రెస్‌ పార్టీ కూడా పరోక్షంగా మీ విజయానికే సహకరించిందన్నారు. విడిపోతే ఓడిపోతామని మీకు భయాన్ని కల్పించింది జగన్‌ అని అన్నారు. ఈ కారణంగానే మీరు ఒకరినొకరు వాటేసుకుంటున్నారన్నారు. మీరు ప్రధాని మోదీ కాళ్ల వద్ద సాగిలబడ్డారన్నారు. 36 జెండాలతో గెలిచిన మీరు ఒంటరిగా పోటీ చేసిన జగన్‌ను విమర్శించడం తగునా అన్నారు.

రోజుకు రూపాయి తీసుకుని మున్సిపాలిటీలో పారిశుధ్యాన్ని అదుపు చేశామని తెలిపారు. చెత్తపన్ను వేశారని విమర్శిస్తున్న మీరు నిత్యావసర వస్తువులైన ఉప్పు, పప్పు, చింతపండు, డీజిల్‌, గ్యాస్‌, పెట్రోలు ధరలను పెంచలేదా అన్నారు. బ్రహ్మంసాగర్‌ ప్రాజెక్టు విస్తరణకు రూ.600 కోట్లు మంజూరు చేశారన్నారు. బుగ్గ వంకకు కరకట్ట నిర్మాణం చేసింది ఎవరని అన్నారు. జమ్మలమడుగులో జగన్‌ మంజూరు చేసిన జిందాల్‌ స్టీల్‌ ప్లాంట్‌ను మీరు కొనసాగించారే తప్ప కొత్తగా మంజూరైంది కాదన్నారు. కొప్పర్తి పారిశ్రామిక వాడను ఏర్పాటు చేసి ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులను పెంచారన్నారు. పులివెందులలో రూ.500 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాలను నిర్మించారన్నారు. కడపలోనే వైఎస్సార్‌ సైక్రియట్రిస్టు హాస్పిటల్‌, క్యాన్సర్‌ కేర్‌ సెంటర్‌ను మంజూరు చేశారన్నారు. అనేక పరిశ్రమలను జగన్‌ తీసుకొచ్చారని తెలిపారు.

వైఎస్‌ కుటుంబానికి కంచుకోట కడప

వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబానికి కడప జిల్లా కంచుకోట లాంటిదని రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. గడిచిన ఎన్నికల్లో జిల్లాకు సంబంధించి మొత్తం మీ పార్టీలకు 8,85,311 ఓట్లు వస్తే వైఎస్సార్‌సీపీకి 8,53,883 ఓట్లు వచ్చాయన్నారు. జగన్‌ హయాంలో జిల్లాకు జరిగిన అభివృద్ధిపై 500 పేజీల పుస్తకాం రాయాల్సి ఉంటుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement