కడప ఎడ్యుకేషన్ : వైఎస్సార్ కడప జిల్లా శేషాచల నల్లమల అటవీ ప్రాంతం చింతకొమ్మదిన్నే మండలం గంగనపల్లె రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని ’డొక్కల మడుగు’ ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో పూర్తిగా ఎండిపోవడంపై మైదుకూరుకు చెందిన ప్రముఖ రచయిత, చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అడవి జంతువుల దాహార్తిని తీర్చే ఈ కీలకమైన నీటి వనరు ప్రస్తుతం ఎడారిని తలపిస్తోందన్నారు. గతంలో కరవు కాలంలో సైతం కొద్దిపాటి నీటితో కళకళలాడే ఈ మడుగుకు ఎలుగుబంట్లు, దుప్పులు, కొండ గొర్రెలు, రేసు కుక్కలు భారీగా వచ్చేవని రమేష్ గుర్తుచేశారు. వీటన్నింటితో పాటు అరుదైన జాతికి చెందిన ’బంగారు నక్కలు’ (Golden Jackals) CMýSP-yìlMìS ఎక్కువగా వస్తుంటాయని, గతంలో తోడేళ్లు, హైనాలు కూడా ఈ ప్రాంతంలో సంచరించేవని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో నీరు లేక ఇక్కడున్న అరుదైన బంగారు నక్కల జాతి అంతరించిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి, అటవీ శాఖకు విజ్ఞప్తి...
వన్యప్రాణుల మనుగడను కాపాడటానికి ప్రభుత్వం, అటవీ శాఖ అధికారులు తక్షణమే స్పందించి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని బొమ్మిశెట్టి రమేష్ డిమాండ్ చేశారు. డొక్కల మడుగులో పేరుకుపోయిన పూడికను తక్షణమే తొలగించాలని కోరారు. కొలుములపల్లె పంచాయతీ లింగారెడ్డిపల్లెకు చెందిన నాగమల్లారెడ్డి తనకు ఈ మడుగు ఎండిన సమాచారం తనకు అందించారని రమేష్ వెల్లడించారు. కడప అటవీ శాఖ అధికారి ప్రసాద్ మాట్లాడుతూ పూడిక తీయడం కష్టంతో కూడుకున్న పని అని, దీనికి శాశ్వత పరిష్కారం కోసం సౌర విద్యుత్ వాటర్ పంపును ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు.


