ప్రొద్దుటూరు క్రైం : ఆంధ్రప్రదేశ్ అంటే కూటమి పాలకులకు అమరావతి, పోలవరం తప్ప మరో ప్రాంత అభివృద్ధి పట్టడం లేదని రాయలసీమ విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడు రాజశేఖర్ విమర్శించారు. ఆదివారం స్థానిక పెన్షనర్స్ అసోసియేషన్ భవనంలో రాయలసీమ విద్యావంతుల వేదిక ప్రచురించిన మన రాయలసీమ నాలుగు బులిటెన్ ఆవిష్కరణ సభ జరిగింది. ఈ సభకు ఆర్‌వీవీ జిల్లా కన్వీనర్ మహమూద్ అధ్యక్షత వహించారు. సభలో రాజశేఖర్ మాట్లాడుతూ పట్టిసీమలో రాయలసీమకు నీళ్లు తెస్తామని 2014లో ఇదే పాలకులు చెప్పారన్నారు. పట్టిసీమ పూర్తయి కోస్తాలో మూడు పంటలకు నీళ్ల సదుపాయం మెరుగుపడింది తప్ప రాయలసీమకు ఆ ప్రాజెక్టు నుంచి చుక్క నీరు అందలేదన్నారు. ఇప్పుడు మళ్లీ సీమ వాసులను మోసం చేయడానికి పోలవరం నుంచి బనకచర్ల పేరుతో కొత్త డ్రామాకు తెర లేపుతున్నారని అన్నారు. కానీ శ్రీశైలం నుంచి రాయలసీమకు కావాల్సిన అన్ని నీళ్లు ఇస్తామని చెప్పడానికి పాలకులకు నోట మాట రాలేదన్నారు. కార్యక్రమంలో రచయితలు దాదా హయత్, పాలగిరి విశ్వప్రసాద్, చదువుల బాబు, వరలక్ష్మి, సికిందర్, బసవరాజు, వేణుగోపాల్, ఆర్ వీవీ జిల్లా కన్వీనర్లు, కోకన్వీనర్లు హరిత, జగదీష్, పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, సీఎంఎస్ జిల్లా కన్వీనర్ పద్మ, ఆర్‌ఎంఎస్ కార్యదర్శి లోఈ్మదేవి, సీఎల్‌పీ జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, పీకేఎస్ నాయకుడు శ్రీనివాసులరెడ్డి, బీసీ సంఘం నేత కృష్ణయ్య పాల్గొన్నారు.


