ఇసుక అక్రమ రవాణా అరికట్టాలి : ఆకేపాటి
● ప్రతి గ్రామంలో ఆటోమేటిక్
వెదర్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
కడప సెవెన్‌రోడ్స్ : 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ. 175.85 కోట్ల వాతావరణ బీమా మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కోరారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా వైఎస్ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ వాతావరణ బీమా కింద కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు విడుదల చేసిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వకపోవడంతో బీమా పెండింగ్‌లో ఉందన్నారు. బీమా తక్షణమే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ సమావేశంలో తీర్మానించాలంటూ ఆయన చేసిన ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు చాలాచోట్ల పనిచేయకపోవడం వల్ల గాలి వేగం నమోదు కావడం లేదన్నారు. ఇందువల్ల రైతులకు బీమా అందడం లేదన్నారు. 2025–26లో పెనుగాలులకు నేలమట్టమైన అరటికి బీమా చెల్లించాలని కోరారు. ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు కొన్ని గ్రామాల్లోనే ఉన్నాయని, ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయాలన్నారు. 50 కిలోమీటర్ల వేగంతో గాలి వీచి పంట కూలిపోతే బీమా చెల్లిస్తామనడం సరికాదన్నారు. ఈ నిబంధన సవరించాలని, ఏ కారణంతో పంట కూలినా బీమా చెల్లించాలని కోరారు. ఉపాధి హామిలో మెటీరియల్ కాంపోనెంట్ కింద జిల్లాకు రూ. 160 కోట్లు రావాల్సి ఉందని తెలిపారు. అధికారులు ఢిల్లీలో అప్‌లోడ్ చేసినా ఇంకా నిధుల విడుదల జరగలేదన్నారు. ఈ నిధులు వెంటనే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ తీర్మానం చేయాలన్న ఆయన ప్రతిపాదనను సమావేశం ఆమోదించింది. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జిల్లాకు సుమారు లక్ష గృహాలు మంజూరు చేయగా, రూ. 1329 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఇంకా 50 వేల ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉందని పేర్కొన్నారు. 1.0లో అదనపు పేమెంట్ బకాయిలను చెల్లించాలన్నారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక ఈ ఆరు నెలల కాలంలో జిల్లాకు కేవలం 1900 ఇళ్లు మాత్రమే మంజూరు చేసిందని విమర్శించారు. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు గ్రీన్‌ఫీల్డ్ హైవే మినహా 440 కిలోమీటర్ల జాతీయ రహదారి పనులు ప్రారంభించామన్నారు. పూర్తికానిపనులను వేగవంతం చేయాలని కోరారు. వేముల, వేంపల్లె మండలాల నుంచి ప్రతిరోజు రూ. 45 లక్షల విలువైన బైరెటీస్ ఖనిజం అక్రమ రవాణా జరుగుతుంటే మైన్స్ అండ్ జియాలజీ అధికారులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. తాను ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లానన్నారు. బైరెటీస్ అక్రమ రవాణా విషయం తమకు కూడా తెలుసని, అయితే మైన్స్ అండ్ జియాలజీ అధికారులు తమకు ఫిర్యాదు చేయకపోవడం వల్ల ఎలాంటి చర్యలు చేపట్టలేకపోతున్నామని ఎస్పీ తెలిపారన్నారు. ఇప్పటికై నా అక్రమ మైన్లను 48 గంటల్లో కట్టడి చేయాలని కోరారు. అక్రమ తవ్వకాలకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, రికవరీ చేయాలని కోరారు. దీనిపై కలెక్టర్ శ్రీధర్ స్పందిస్తూ నిరంతరం నిఘా ఉండాలని ఆదేశించారు. జిల్లా పరిషత్ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి, బ్రహ్మంగారిమఠం ఎంపీపీ వీర నారాయణరెడ్డి, వీఎన్ పల్లె, చెన్నూరు ఎంపీపీలు రఘునాథరెడ్డి, చీర్ల సురేష్‌యాదవ్, జెడ్పీ సీఈఓ పాల్గొన్నారు.
సమావేశంలో పాల్గొన్న అధికారులు
మాట్లాడుతున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ మాట్లాడుతూ బద్వేలులో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ ఆస్పత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని కోరారు. బద్వేలు, పోరుమామిళ్లలో డాక్టర్ల కొరత ఉందని, ఖాళీలను భర్తీ చేయాలన్నారు. ఎస్.వెంకటాపురం గ్రామంలో గృహ నిర్మాణ సంస్థ ద్వారా నిర్మించిన ఇళ్లు కారుతున్నాయని తెలిపారు. వీటి మరమ్మతులకు నిధులు ఇవ్వాలని కోరారు.
నందలూరు మండలంలో యంత్రాలతో ఇసుకను తవ్వేస్తూ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి తెలిపారు. బాలరాజుపల్లెలో రోజుకు వందల టిప్పర్లతో ఇసుకను తరలిస్తున్నారన్నారు. అసలే ఎల్‌నినో పరిస్థితితో ఇసుకను తరలిస్తే తాగునీటికి ఇబ్బందులు కలుగుతాయన్నారు.అధికారులు చర్యలు చేపట్టకపోతే ప్రజలతో కలిసి ఆందోళనబాట పట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.


