కడప ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ ఆర్‌ఐవో (ఎఫ్‌ఏసీ)గా పీఎల్‌ఎన్ ప్రకాశరావు పట్నాయక్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించిన కళాశాలల అభివృద్ధితోపాటు విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తానన్నారు. అలాగే ఇంటర్ విద్యార్థులకు నాణ్యమైన విద్య, పరీక్షల నిర్వహణ, ఫలితాల్లో మెరుగైన ప్రగతి సాధనకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐవో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
కలసపాడు : మండలంలో దొంగనోట్ల చెలామణి రోజురోజుకు అధికమవుతుంది. నాలుగు రోజులుగా పెట్రోలు బంకులు, దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో ఎక్కువ మొత్తంలో దొంగనోట్లు చెలామణి అవుతున్నాయి. ఇటీవల పోరుమామిళ్ల రోడ్డులోని ఓ పెట్రోలు బంకులో కొందరు రూ.500, రూ.200 దొంగనోట్లు ఇచ్చి పెట్రోలు పట్టుంచుకున్నారని, అవి దొంగనోట్లు అని గుర్తు పట్టకపోవడంతో నష్టపోతున్నామని పెట్రోలు బంకు నిర్వాహకులు తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి దొంగనోట్లను చెలామణి చేస్తున్న వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని మండల వాసులు కోరుతున్నారు.
ఎర్రగుంట్ల : మండల పరిధిలోని నిడుజివ్వి సమీపంలోని నాపరాయి గనిలో శుక్రవారం ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నెల్సన్ అనే కూలీ తీవ్రంగా గాయపడ్డాడు. కలమల్ల గ్రామానికి చెందిన నెల్సన్ నిడుజివ్వి గ్రామం సమీపంలో ఉన్న నాపరాయి గనుల్లో కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గనిలో నుంచి ట్రాక్టర్ పైకి వస్తుండుగా బ్రేక్ పెయిల్ అవడంతో డ్రైవర్ ట్రాక్టర్‌ను అదుపు చేయలేకపోయాడు. దీంతో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గాయపడిన బాధితుడిని 108 వాహనంలో ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం కడపకు తీసుకెళ్లారు. ఈ విషయంపై ఎర్రగుంట్ల సీఐ విశ్వనాథరెడ్డిని వివరణ కోరగా ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే విచారణ చేపడుతామని చెప్పారు.


