టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం

Jun 19 2026 2:18 AM | Updated on Jun 19 2026 2:18 AM

వీఆర్‌ఏ పోస్టు పేరిట రూ.4.50 లక్షలు దండుకున్న దాయాది నేత

బిల్టప్‌ సభలో బారికేడ్ల వద్ద 250 ఎంఎల్‌ పురుగుల మందు తాగిన యువకుడు

3 నెలల పసికందు తండ్రి

పరిస్థితి విషమం

తిరుపతికి తరలింపు

కడప అర్బన్‌: తెలుగుదేశం పార్టీ రెండేళ్ల ‘అభివృద్ధి’ జంబూర సభ.. ఒక పేద కార్యకర్త పాలిట ప్రాణాంతకంగా మారింది. సొంత పార్టీ నేతల అవినీతి, నమ్మకద్రోహానికి బలైన ఓ యువ కార్యకర్త సభా ప్రాంగణంలోనే అందరూ చూస్తుండగా పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. ముద్దనూరు మండలం కాండ్లపల్లెకు చెందిన చప్పిడి పద్మనాభరెడ్డి పెద్దకుమారుడు చప్పిడి సతీష్‌కుమార్‌ రెడ్డి (29) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. ఇతనికి ఏడేళ్ల క్రితం వివాహం కాగా, మూడు నెలల క్రితమే ఓ కుమారుడు జన్మించాడు. సతీష్‌కు విఆర్‌ఏ పోస్టు ఇప్పిస్తానని నమ్మబలికి, అతని దాయాది అయిన ఒక స్థానిక టీడీపీ నాయకుడు రూ.4.50 లక్షల లంచం దండుకున్నాడు. ఆపై సతీష్‌ను కొన్ని రోజుల పాటు అవుట్‌సోర్సింగ్‌లో చేర్పించి, ఆ తర్వాత ఉన్నట్టుండి ఉద్యోగం నుంచి తొలగించారు. ఉద్యోగం పోవడం, ఇచ్చిన భారీ మొత్తం తిరిగి రాకపోవడంతో సతీష్‌ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు.గురువారం కడప నగరంలోని బిల్టప్‌ వద్ద ఆర్భాటంగా ప్రారంభమైన టీడీపీ అభివృద్ధి సమావేశానికి వచ్చిన సతీష్‌, బారికేడ్ల వద్దకు వెళ్లి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును గడగడా తాగేశాడు. గమనించిన సహచర కార్యకర్తలు వెంటనే అతని చేత మందును కక్కించే ప్రయత్నం చేసి, 108 ద్వారా కడపలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. బాధితుడికి అత్యవసర వైద్యం అందించిన పల్మనాలజీ వైద్యులు డాక్టర్‌ సి.రామాంజులరెడ్డి, జనరల్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ సుప్రజారెడ్డిలు మాట్లాడుతూ.. బాధితుడు దాదాపు 250 ఎంఎల్‌ కంటే ఎక్కువగానే పురుగుల మందు సేవించాడని, యాంటిబయాటిక్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చినప్పటికీ 72 గంటల వరకు ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పలేమన్నారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ప్రత్యేక అంబులెన్స్‌లో తిరుపతికి తరలించారు.ఈ ఘోరం జరగడంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ నాగరాజు, డిప్యూటీ కమిషనర్‌ రాకేష్‌చంద్రం, తహసీల్దార్‌ మహబూబ్‌చాన్‌ ఆసుపత్రి వద్ద హడావుడి చేశారు. అయితే అసలు సతీష్‌ ఎందుకు పురుగుల మందు తాగాడో తమకు తెలియదంటూ అధికారులు దాటవేత సమాధానం ఇవ్వడం గమనార్హం. ప్రస్తుతం కడప తాలూకా సీఐ నరసింహరాజు ఆధ్వర్యంలో ఎస్‌ఐ మహమ్మద్‌ రఫీ కేసు విచారిస్తున్నారు.

చప్పిడి సతీష్‌కుమార్‌ రెడ్డికి చికిత్స

అందిస్తున్న వైద్యులు

ఆసుపత్రి వద్ద విలపిస్తున్న బాధితుడి తల్లి శారద, నాయనమ్మ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement