● తీవ్ర గాయాలతో రిమ్స్ లో చికిత్స
పొందుతున్న జేసీబీ డ్రైవర్
● కూటమి పెద్దలలో ఒక వర్గం ద్వారా రాజీ యత్నాలు
కడప అర్బన్ : జిల్లా లోని వల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గోటూరులో ఈనెల 26వ తేదీన మల్లికార్జున అనే రైతు తన పొలం సమీపంలో మట్టిని జేసీబీ సాయంతో తవ్వి ట్రాక్టర్ లో వేసుకొని నారవ గుంతలు పూడ్చుకుంటుండగా వల్లూరు ఎస్‌ఐ శివనాగిరెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. తమ కానిస్టేబుల్ తో పాటు మోటార్ సైకిల్ లో వెళ్లి ట్రాక్టర్ ను వెంటబడి డ్రైవర్ వెంకటేష్‌పై దాడి చేశాడు. ట్రాక్టర్ డ్రైవర్ వెంకటేష్ ను కసితీరా కొట్టడం, జేసీబీ డ్రైవర్ ఓబులేసు ను బుధవారం స్టేషన్‌కు పిలిపించి మరీ చితక బాదడం, ఎస్‌ఐ ఆగ్రహానికి పరాకాష్టగా మారింది. ఈ సంఘటనను కూటమి పెద్దలే ఓర్వలేకపోయారు. కూటమి పెద్దలలో ఒక వర్గం వారు ఎస్‌ఐ ఓవరాక్షన్ ను తప్పు పట్టారు. మరో వర్గం వారు ఎస్‌ఐ చర్యలను వ్యతిరేకించకపోయినా బాధితుల వల్ల పోలీసు శాఖకు చెడ్డ పేరు వస్తుందని తమవంతుగా రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సంఘటనపై వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వల్లూరు ఎస్‌ఐగా పనిచేస్తున్న శివనాగిరెడ్డి, తమ కానిస్టేబుల్ నాగరాజు తో కలిసి ఈనెల 26న తమ మండల పరిధిలో ఉన్న వండర్ లా లో టీడీపీ నేతలు మహానాడు సభను ఈనెల 27, 28 తేదీలలో నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేస్తుండగా వాటిని పరిశీలించేందుకు వెళ్లారు. అదే సమయంలో వండర్ లా కు కాస్త దూరంలో వంక వద్ద నుంచి జేసీబీ తో మట్టిని ట్రాక్టర్ లో వేయించుకొని రైతు మల్లికార్జున తమ పొలానికి తీసుకెళ్తున్నారు. ఈ సమయంలో ఆ సంఘటనను చూసిన వల్లూరు ఎస్‌ఐ శివనాగిరెడ్డి, తనతో పాటు వచ్చిన కానిస్టేబుల్ నాగరాజు తో పాటు సంఘటనా స్థలానికి వేగంగా చేరుకున్నారు. ఆ క్రమంలో అదుపుతప్పి కింద పడ్డారు. ఎస్‌ఐ కి స్వల్ప గాయాలు కాగా, కానిస్టేబుల్ నాగరాజు గాయపడ్డాడు. కాస్తంత ఉపశమనం కూడా పొందకుండా ఎస్‌ఐ శివనాగిరెడ్డి కోపంతో ఊగిపోయారు. ట్రాక్టర్ ను పట్టుకునేందుకు వెళ్లగా భయంతో ట్రాక్టర్ డ్రైవర్ వెంకటేష్ ముందుకెళ్లాడు. అతన్ని వెంబడించిన ఎస్‌ఐ పట్టుకొని అక్కడికక్కడే డ్రైవర్‌ను చితకబాదాడు. అంతటితో ఆగకుండా వాహనాలను స్టేషన్‌కు తీసుకొచ్చారు. జేసీబీ డ్రైవర్ ఓబులేసు కడప నుంచి విధులకు వెళ్లాడు. అతన్ని బుధవారం స్టేషన్ కు పిలిపించి చితకబాదాడు. కాళ్లకు చేతులకు, నడుముకు వాతలు పడి ఓబులేసు గాయాల పాలయ్యాడు. తర్వాత అతన్ని వదిలిపెట్టడంతో వెంటనే రిమ్స్ లో చేరి చికిత్స పొందుతున్నాడు. మరోవైపు వెంకటేశు ను రిమ్స్ కు పంపకుండా కూటమి పెద్దలలో ఓ వర్గం అతన్ని రాజీ చేసుకున్నారని సమాచారం. రైతు మల్లికార్జున తన పొలానికి సమీపంలో ఉన్న వంక నారవ నుంచి మట్టిని తీసుకుని వెళ్లి తన పొలానికి మట్టి వేసుకోవడం ఎందుకు తప్పవుతుందని ఒక వర్గం వారు ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటనలో వల్లూరు ఎస్‌ఐ శివనాగిరెడ్డి ఆగ్రహంతో ఓబులేసు పై దాడి చేయడం సమంజసంగా లేదని బాధితుని కుటుంబ సభ్యులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితుడు కోరుకుంటున్నాడు. చట్ట పరిధిలో తమకు న్యాయం జరగకపోతే మరింత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు. ఈ సంఘటనపై పోలీసు ఉన్నతాధికారులు ఏమేరకు స్పందిస్తారో వేచి చూడాల్సిందే.


