లింకు దొరికింది.. డొంక కదిలింది | - | Sakshi
Sakshi News home page

లింకు దొరికింది.. డొంక కదిలింది

May 17 2026 7:02 AM | Updated on May 17 2026 7:02 AM

ప్రొద్దుటూరు క్రైం : ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు ముగింపు దశకు చేరుకున్నాయి. మ్యాచ్‌ ప్రారంభంలో ప్రొద్దుటూరు పోలీసులు ఇక్కడి బుకీలకు పలుమార్లు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. పోలీసుల ఆదేశాలు హెచ్చరికలు, ఆదేశాలను ఖాతరు చేయని బుకీలు క్రికెట్‌ మ్యాచ్‌లు ప్రారంభం కాగానే మెల్లగా ఒక్కొక్కరు జారుకున్నారు. ప్రొద్దుటూరులో ఉంటే కదా పోలీసులు మమ్మల్ని పట్టుకునేది అని భావించిన బడా బుకీలు, చోటామోటా పందెం రాయుళ్లందరూ ఇతర రాష్ట్రాలు, బయటి దేశాలకు వెళ్లిపోయారు. అక్కడి నుంచి యాప్‌ల ద్వారా నిరభ్యంతరంగా బెట్టింగ్‌ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఐపీఎల్‌ ప్రారంభమై రెండు నెలలు గడిచినా చిన్నా, చితక పందెం రాయుళ్లు తప్ప ప్రధాన బుకీలు ఎవ్వరూ పోలీసులకు దొరకలేదు. ఏం చేయాలో పాలుపోక పోలీసు అధికారులు తల బాదుకోసాగారు. ఇలాంటి సమయంలో ఓ లింకు పోలీసు అధికారులకు ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఇటీవల లేపాక్షిలో అక్కడి పోలీసులు దాడి చేసి పలువురు బుకీలను అదుపులోకి తీసుకున్నారు. వారితో ప్రొద్దుటూరు బుకీలతో సంబంధాలు ఉండటంతో ప్రొద్దుటూరు పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా గాంధీరోడ్డులోని ప్రధాన బుకీ ఇంట్లో దాడులు నిర్వహించగా.. అతను తప్పించుకున్నాడు.

ప్రొద్దుటూరులో కోవెలకుంట్ల బుకీ పాగా

కోవెలకుంట్ల ప్రాంతంలో పేరు మోసిన ఒక క్రికెట్‌ బుకీ ప్రొద్దుటూరులో పాగా వేసినట్లు కనిపిస్తోంది. కర్నూలు, నంద్యాల జిల్లాలో బెట్టింగ్‌ డాన్‌గా పేరు పొందిన ఆ బుకీకి ప్రొద్దుటూరులోని ప్రధాన బుకీలతో పరిచయం ఏర్పడింది. దీంతో అతను ఇక్కడ కూడా కార్యకలాపాలు ముమ్మరం చేశాడు. సమయం దొరికినప్పుడల్లా అతను ఇక్కడికి వచ్చి బంగారు బిస్కెట్లను కొనుగోలు చేసి తీసుకెళ్తుంటాడు. ప్రొద్దుటూరు బుకీలకు కోవెలకుంట్ల బెట్టింగ్‌ డానే యాప్‌లకు సంబంధించిన ఐడీలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అతను ఇచ్చిన యాప్‌ల ద్వారానే ఇక్కడి బుకీలు అనేక మంది క్రికెట్‌ పందేలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ప్రొద్దుటూరులోని కాల్వకట్టకు చెందిన ఒక క్రికెట్‌ బుకీ పట్టుపడగా.. అతని మొబైల్‌లోని యాప్‌లను పరిశీలిస్తే కోవెలకుంట్ల బుకీ పెద్ద ఎత్తున లావాదేవీలు జరిపినట్లు నిర్ధారణ అయింది. దీంతో పోలీసులు అతని కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అతనికి సహకరిస్తున్న ప్రొద్దుటూరు బుకీల లిస్టు ఒకటి పోలీసులు ఇప్పటికే సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. కోవెలకుంట్ల వాసి అయిన ఆ బుకీ ప్రస్తుతం బెంగళూరుకు మకాం మార్చాడు. కొందరు బుకీలు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు దాడులకు సమాయత్తం అవుతున్నారు. కోవెలకుంట్ల బుకీతోపాటు అతనితో సంబంధాలున్న ప్రొద్దుటూరు బుకీలు ముంబైలో ఉన్నట్లు తెలుస్తోంది.

పట్టుకున్నారు.. వదిలేశారు

కాగా మూడు రోజుల క్రితం ప్రొద్దుటూరు పోలీసులు క్రికెట్‌ బుకీ కారులో నుంచి రూ.20 లక్షలుపైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం ముగ్గురిని ఇంటికి పంపించారు. స్వాధీనం చేసుకున్న డబ్బును కూడా వాళ్లకు ఇచ్చినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ నాయకులు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. వాళ్ల ఒత్తిడి మేరకే స్వాఽధీనం చేసుకున్న డబ్బును ఇచ్చిపంపినట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై అనేక విమర్శలు వస్తున్నాయి. పోలీసు అధికారులు మాత్రం ఈ కేసును విచారణ చేస్తున్నామని చెబుతున్నారు.

బ్యాంక్‌ అకౌంట్లను పరిశీలిస్తున్న పోలీసులు

పోలీసుల నుంచి తప్పించుకున్న ప్రధాన బుకీ అకౌంట్లను పోలీసు అధికారులు లోతుగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వారికి సంబంధించిన సెకండ్‌ హ్యాండ్‌ కార్ల షెడ్‌లో రూ.కోట్లలో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో వాళ్లకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది.. క్రికెట్‌ బెట్టింగ్‌ డబ్బులతో సెకండ్‌హ్యాండ్‌ కార్ల బిజినెస్‌ సాగిస్తున్నారా అనే కోణంలో దర్యాపు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారి బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇన్ని రోజులు బెట్టింగ్‌ కేసులు లేక ఖాళీగా ఉన్న ప్రొద్దుటూరు పోలీసులకు ఇప్పుడు చేతి నిండా పని దొరికింది. ఒక్క లింకుతో బుకీల డొంక కదిలినట్లు అయింది. పోలీసులు ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా పని చేస్తే దొరికిన లింకుల ఆధారంగా ప్రొద్దుటూరులో ఉన్న ప్రధాన బుకీలందరి ఆట కట్టించవచ్చు. చూడాలి మరి పోలీసు అధికారులు ఎంత వరకు వెళ్తారో.. ఎందరిని అరెస్ట్‌ చేస్తారో.

కోవెలకుంట్ల క్రికెట్‌ బుకీకి ప్రొద్దుటూరు బుకీలతో సంబంధాలు

రెండు రోజుల క్రితం జరిగిన పోలీసుల దాడుల్లో బహిర్గతం

ప్రొద్దుటూరు ప్రధాన బుకీల కోసం పోలీసుల వేట

Advertisement
 
Advertisement
Advertisement