పెట్రోలు, డీజిల్‌ కొరతకు ప్రభుత్వ వైఫల్యమే కారణం | - | Sakshi
Sakshi News home page

పెట్రోలు, డీజిల్‌ కొరతకు ప్రభుత్వ వైఫల్యమే కారణం

Apr 29 2026 8:00 AM | Updated on Apr 29 2026 8:00 AM

వారం రోజులుగా అన్ని వర్గాల

వారు నష్టపోతున్నారు

ప్రతి ఆటో కార్మికుడికి రోజుకు రూ.1000 చెల్లించాలి

మాజీ ఎమ్మెల్యే

రాచమల్లు శివప్రసాదరెడ్డి

ప్రొద్దుటూరు : రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో పెట్రోలు, డీజిల్‌ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇది ఓ రకంగా సంక్షోభమేనని వెఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం ప్రొద్దుటూరులోని తన క్యాంప్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా, మన దేశంలో ఎక్కడా ఈ కొరత లేదని, మన రాష్ట్రంలో మాత్రమే ఉందన్నారు. దీనివల్ల వ్యవసాయదారులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. పంట నూర్పిళ్ల యంత్రాలకు, రైతుల ట్రాక్టర్లకు డీజిల్‌ ఎంతో అవసరమని తెలిపారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఆటో కార్మికులు, ఆక్వా రైతులు, నిత్యావసర వస్తువులకు సంబంధించి సరఫరా చేసే వాహనదారులు ఇలా అన్ని వర్గాల వారు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని అన్నారు. వారం రోజులుగా సమస్య ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు కళ్లు తెరవలేదని తెలిపారు. అలసత్వం కంటే చంద్రబాబు అసమర్థతే ఇందుకు కారణమని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ఆయనకు చిత్తశుద్ధి లేదని, పరిపాలన దక్షత లేదని అన్నారు. ఆర్భాటంగా తాను గొప్ప అడ్మినిస్ట్రేటర్‌ని అని సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇచ్చుకుంటున్నారన్నారు. సంక్షోభం నుంచి ప్రజలను, రైతులను గట్టెక్కెంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

ఇతర రాష్ట్రాల్లోనే ధరలు తక్కువ

డీజిల్‌, పెట్రోలు ధరలు మన రాష్ట్రం కంటే పక్క రాష్ట్రాల్లోనే తక్కువగా ఉన్నాయని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు తగ్గిస్తామని చెప్పిన మంత్రి లోకేష్‌ ఏమి చేస్తున్నారని రాచమల్లు ప్రశ్నించారు. మన రాష్ట్రంలో పెట్రోలు ధర రూ.109.37, కర్ణాటకలో రూ.102, చైన్నెలో రూ.100, తెలంగాణలో రూ.107, ఢిల్లీలో రూ.95 ఉందన్నారు. అలాగే మన రాష్ట్రంలో డీజిల్‌ ధర రూ.97.22 ఉండగా కర్ణాటకలో రూ.90, చైన్నెలో రూ.92, ఢిల్లీలో రూ.87 ఉందన్నారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ డీజిల్‌ లేక ఆగిపోయింది అన్నారు. అన్ని చోట్ల ఈ ప్రభుత్వంలో పెట్రోలు బంకుల్లో నో స్టాక్‌ బోర్డులు కనిపిస్తున్నాయని విమర్శించారు. గ్యాస్‌ ఏజెన్సీల వద్ద నో స్టాక్‌, రైతులు వెళితే యూరియా అంగళ్ల వద్ద నోస్టాక్‌ బోర్డులు ఉన్నాయని, ప్రైవేటు ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీకి ఫుల్‌స్టాప్‌ పెట్టారని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, డీఏలు లేవని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతితోపాటు ఉద్యోగాలు లేవన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని, గత రెండేళ్లుగా పరిస్థితి ఇలాగే ఉందన్నారు. అంబులెన్స్‌లకు కూడా డీజిల్‌ దొరకని పరిస్థితి వచ్చిందని, ఆస్పత్రుల్లో ఈ సమస్య కారణంగా ఆపరేషన్లు చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని, గత ఐదు రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటో కార్మికులకు రోజుకు రూ.1000గా పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ప్రజలంతా చంద్రబాబు ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను గమనించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement