కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ప్రైవేట్ బస్సుల ప్రమాదాలు ఆగడం లేదు. ఇటీవల కాలంలో కర్నూల్, అరకు, చిత్తూరు జిల్లా గంగసాగరం ప్రాంతాల్లో జరిగిన ఘటనలు మరువక ముందే మార్కాపురం వద్ద మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి ప్రయాణాలపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. వైయస్సార్ జిల్లా కేంద్రం మీదుగా విజయవాడ, బెంగళూరు హైదరాబాద్ విశాఖపట్నం వంటి ప్రాంతాలకు దాదాపు 500 పైగా ప్రైవేట్ బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ ప్రయాణంలో అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాలపై రవాణా శాఖ అధికారులు దృష్టి సారించారు. జిల్లాలోని గువ్వల చెరువు ఘాట్‌రోడ్డు, దువ్వూరు, మైదుకూరు, ఖాజీపేట ప్రాంతాల్లోని రోడ్లు ప్రమాదాలకు నిలయం మారాయి. ఈ మార్గాల్లో ప్రమాదాలు జరగకుండా రవాణాశాఖ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారు. బస్సులను నిత్యం తనిఖీలు చేస్తున్నారు. అయినా ప్రాథమికంగా వెలుగులోకి వస్తున్న అంశాలు అందోళన కలిగిస్తున్నాయి. అధిక వేగం, డ్రైవర్ల ఆలసట, నిర్లక్ష్య డ్రైవింగ్, వాహనాల్లో లోపాల వల్ల ఎక్కడో ఒక చోట ప్రమాదాలకు దారి తీస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఉన్నప్పటికీ బస్సుల వాస్తవ పరిస్థితి అనుమానాస్పదంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రంగంలోని రవాణాశాఖ
మార్కాపురం ప్రమాదాల పరంపర నేపథ్యంలో రవాణాశాఖ అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలకు శ్రీకారం చుట్టింది. చెక్‌పోస్ట్‌లు, హైవేలపై విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. డ్రైవర్ల లైసెన్స్‌లు, వాహన ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, పర్మిట్, ఇన్సూరెన్స్ పత్రాలను పరిశీలిస్తున్నారు. ఓవర్‌లోడింగ్, ఓవర్ స్పీడ్‌పై ప్రత్యేక నిఘా పెట్టారు. నిబంధనలు పాటించని ప్రైవేట్ బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు సష్టం చేస్తున్నారు. తీవ్ర లోపాలు ఉన్న వాహనానలు సీజ్ చేయడం, కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. అవసరమైతే అనుమతులను రద్దు చేసే చర్యలకు వెనుకాడబోమని అంటున్నారు.
భద్రతే లక్ష్యం
ప్రయాణికుల భద్రతే లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థ్దలో క్రమశిక్షణ తీసుకురావడమే ఈ తనిఖీల లక్ష్యమని పేర్కొంటున్నారు. ప్రభుత్వ చర్యలతో పాటు ప్రయాణికులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. బస్సు పరిిస్థ్దితి గమనించడం, అధిక వేగంపై అభ్యంతరం చెప్పడం అవసరమని అధికారులు చెబుతున్నారు.
ప్రైవేట్ ట్రావెల్స్ వైపు పెరుగుతున్న
అనుమానాలు
వరుస ప్రమాదాలతో రవాణాశాఖ అలర్ట్
జిల్లా వ్యాప్తంగా తనిఖీలు
నిబంధన ఉల్లంఘిస్తే కఠిన చర్యలు


