వల్లూరు: వల్లూరు మండల పరిధిలోని పుష్పగిరి వద్ద పెన్నా నదిలో ఆదివారం గల్లంతైన ముగ్గురు యువకులకు సంబంధించి సోమవారం మూడో మృతదేహం లభించింది. ఇన్‌స్టాలో పరిచయమైన పలు ప్రాంతాలకు చెందిన 8 మంది షార్ట్ ఫిల్మ్‌లు, రీల్స్ చేసే క్రమంలో కడప నగర పరిసర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేసుకుని ఆదివారం భోజనం పార్సిళ్లతో పుష్పగిరి వద్దకు వచ్చి సరదాగా పెన్నా నదిలో దిగగా హరిబాబు (25), హర్ష వర్దన్ (22), కృష్ణ చైతన్య(20) లు నీటిలో మునిగి గల్లంతైన విషయం విదితమే. పోలీసులు స్థానిక జాలర్లు, ఫైర్ సిబ్బందితో కలిసి చేపట్టిన గాలింపు చర్యల్లో అదే రోజు సాయంత్రం హర్ష వర్దన్, హరిబాబు మృతదేహాలు లభ్యం కాగా చీకటి పడే వరకు గాలించినా కృష్ణ చైతన్య ఆచూకీ లభించలేదు. ఎస్‌ఐ శివ నాగిరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ఫైర్ సిబ్బంది, జాలర్ల సహాయంతో తిరిగి గాలింపు చర్యలు చేపట్టగా సంఘటన జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలో కృష్ణ చైతన్య మృతదేహం లభ్యమైంది. పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


