మాటలేనా..చేతల్లో చూపిస్తారా | - | Sakshi
Sakshi News home page

మాటలేనా..చేతల్లో చూపిస్తారా

Apr 2 2026 7:41 AM | Updated on Apr 2 2026 7:41 AM

కొన్ని రోజుల క్రితం ముగిసిన

టి–20 ప్రపంచకప్‌లో చెలరేగిన బుకీలు

అడపా దడపా కేసులతో

సరిపెట్టుకున్న పోలీసులు

క్రికెట్‌ బెట్టింగ్‌కు అడ్డాగా మారిన

ప్రొద్దుటూరు

ప్రొద్దుటూరు క్రైం : ఇటీవలే టి–20 ప్రపంచకప్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు ముగిశాయి. ఈ మ్యాచ్‌లకు ముందు కూడా పోలీసులు ఆయా స్టేషన్‌ల పరిధిలో ఉన్న క్రికెట్‌ బుకీలను పిలిపించి కౌన్సెలింగ్‌తో పాటు పందేలు నిర్వహిస్తే తాట తీస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఒకటి, రెండు స్టేషన్లలో క్రికెట్‌ పందేలు నిర్వహిస్తున్న చిన్నా చితకా వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రధాన, బడా బుకీలెవ్వరూ పట్టుబడలేదు. పోలీసులు వీళ్లనెవ్వరినీ టచ్‌ చేయలేదు. ప్రధాన బుకీలను టచ్‌ చేయలేదా చేయలేకపోయారా అనేది తెలియడం లేదు. రోజుకు మూడు మ్యాచ్‌ల చొప్పున నెల రోజుల పాటు టి 20 క్రికెట్‌ మ్యాచ్‌లు జరిగాయి. పలుకుబడి, అధికార పార్ట్టీ అండ ఉన్న బుకీలు స్థానికంగా ఉంటూ క్రికెట్‌ పందేలు పెద్ద ఎత్తున నిర్వహించారు. కొందరు ప్రధాన బుకీలు, పేరున్న బుకీలు మాత్రం పక్క రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్లిపోయారు. అయితే నెల రోజుల పాటు క్రికెట్‌ పందేల్లో బిజీగా ఉన్న బుకీలు తర్వాత ప్రొద్దుటూరుకు వచ్చి వారి వ్యక్తగత, ఇతర సాధారణ కార్యకలాపాలు చూసుకుంటూ ఉండిపోయారు. మ్యాచ్‌ల కంటే ముందు కౌన్సిలింగ్‌కు వెళ్లిన బుకీలు తర్వాత ‘మమ్మల్ని టచ్‌ చేసేదెవరు’ అన్నట్టు ప్రొద్దుటూరులో చెట్టాపట్టాలేసుకొని దర్జాగా తిరుగుతున్నారు.

మళ్లీ అదే సీన్‌ రిపీట్‌ అవుతుందా..

సుమారు రెండు నెలల పాటు ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు జరగుతాయి. ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరులోని అన్ని స్టేషన్ల పరిధిలో ఉన్న బుకీలు, మట్కా నిర్వాహకులను పోలీసులు పిలిపించారు. ఎస్‌డీపీఓ కార్యాలయంలో ఏఎస్పీ విభూకృష్ణ బుకీలందరికీ వార్నింగ్‌ ఇచ్చారు. ఇక నుంచైనా క్రికెట్‌ పందేలు మానుకొని మంచిగా జీవించాలని చెప్పారు. లేదంటే మాత్రం ఎక్కడున్నా పట్టుకొచ్చి కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. బయటి ప్రాంతాలకు వెళ్లి ఇక్కడి వారితో క్రికెట్‌ పందేలు నిర్వహిస్తామంటే చూస్తూ ఊరుకోమని టెక్నాలజీని ఉపయోగించి దేశంలో ఏ మారుమూల రాష్ట్రంలో ఉన్నా పట్టుకొస్తామని ఏఎస్పీ గట్టిగా హెచ్చరించారు. కాగా కౌ న్సెలింగ్‌లో ప్రధాన బుకీలెవ్వరూ కనిపించక పోవడం విశేషం. ప్రధాన బుకీలకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌ ఇస్తారేమోనని పలువురు చర్చించుకుంటున్నారు.

పొలిటికల్‌ ముసుగులో బుకీలు

కొందరు ప్రధాన బుకీలకు అధికార పార్టీ అండదండలు ఉన్నట్లు తెలుస్తోంది. పొలిటికల్‌ ముసుగులో ఉన్న కొందరు ప్రధాన బుకీలు సొంతంగా యాప్‌లను నడిపిస్తునట్లు తెలుస్తోంది. ఇంకొందరు అసిస్టెంట్‌లను నియమించుకొని బెట్టింగ్‌ నడిపిస్తున్నారు. ప్రొద్దుటూరు పోలీసులవి మాటలేనా.. లేక చేతల్లో చూపిస్తారా..అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది. అని క్రికెట్‌ పందేల నిరోధానికి పోలీసులు తీసుకునే చర్యలపై ప్రొద్దుటూరు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మకాం మార్చిన బుకీలు

ఏఎస్పీ విభూకృష్ణ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రధాన, బడా బుకీలు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. కొందరు బెంగళూరు, చైన్నె, తిరుపతి, గోవా, హైదరాబాద్‌లకు వెళ్లగా.. మరి కొందరు దేశమే విడిచి వెళ్లినట్లు తెలుస్తోంది. అఽధికార పార్టీ అండ ఉంటుందని భావించే క్రికెట్‌ పందెంగాళ్లు స్థానికంగానే ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు బుకీలు ఇప్పటికే ప్రొద్దుటూరులోని అపార్ట్‌మెంట్లలో ఇళ్లను అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. ఒకేచోట ఉండకుండా వారానికి మరో చోటికి మకాం మార్చేలా ప్లాన్‌ రూపొందించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. కొందరు బుకీలు తమ ఇళ్లలోనే ప్రత్యేకంగా రూపొందించుకున్న విలాసవంతమైన గదిలోనే బెట్టింగ్‌ కార్యకలాపాలు నిర్వహించుకోనున్నట్లు తెలిసింది. సాధారణంగా క్రికెట్‌ మ్యాచ్‌లు జరిగే సమయంలో గతంలో ప్రతి రోజు క్రికెట్‌ పందేలు నిర్వహించే వ్యక్తులను ఆయా సీఐలు, ఎస్‌ఐలు స్టేషన్లకు పిలిపించేవారు. మ్యాచ్‌ పూర్తయ్యే వరకు ఆయా స్టేషన్లలోనే ఉండేవారు. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించలేదు.

జిల్లా అంతటా బెట్టింగ్‌కు

రంగం సిద్ధం చేసుకున్న బుకీలు

ప్రొద్దుటూరు బుకీలకు ప్రొద్దుటూరుతో పాటు జిల్లా అంతటా సంబంధాలు ఉన్నాయి. కడప జిల్లానే గాక రాయలసీమలోని జిల్లాల్లో కూడా వీరు పందేలు నిర్వహించుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. రోజుకు రూ. కోట్లలో పందేలు జరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ప్రొద్దుటూరులోని మోడంపల్లె, నడింపల్లె, దస్తగిరిపేట, జిన్నారోడ్డు, మైదుకూరు రోడ్డు, శ్రీనివాసనగర్‌, వైఎంఆర్‌కాలనీ, హౌసింగ్‌బోర్డు, భగత్‌సింగ్‌ కాలనీ, బొల్లవరం, గాంధీరోడ్డు, మెయిన్‌బజార్‌, తదితర ప్రాంతాల్లో భారీగా క్రికెట్‌ బెట్టింగ్‌ జరుగుతున్నట్లు తెలుస్తోంది. యువత జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న క్రికెట్‌ బెట్టింగ్‌ను అరికట్టాలని ప్రొద్దుటూరు ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement