దివ్య సుగుణాల పరిమళభరిత సారమే ‘ఈద్‌–ఉల్‌–ఫితర్‌’ | - | Sakshi
Sakshi News home page

దివ్య సుగుణాల పరిమళభరిత సారమే ‘ఈద్‌–ఉల్‌–ఫితర్‌’

Mar 22 2026 1:55 AM | Updated on Mar 22 2026 1:55 AM

దివ్య సుగుణాల పరిమళభరిత సారమే ‘ఈద్‌–ఉల్‌–ఫితర్‌’

కడప కార్పొరేషన్‌: దైవభక్తి, శాంతి, సమైక్యత, సోదర స్నేహ భావాలు, దానధర్మాలు వంటి దివ్య సుగుణాల పరిమళభరిత సారమే.. ‘ఈద్‌–ఉల్‌–ఫితర్‌‘(రంజాన్‌ పర్వదినం) అని మాజీ ఉపముఖ్యమంత్రి ఎస్‌.బి.అంజాద్‌బాషా అన్నారు. శనివారం రంజాన్‌ సందర్భంగా బిల్టప్‌ సర్కిల్‌లోని అమీనియా ఈద్గాలో పెద్దదర్గా పీఠాధిపతులు హజరత్‌ సయ్యద్‌ షా అరీఫుల్లా హుసేనీ సాహెబ్‌ ఆధ్వర్యంలో రంజాన్‌ పర్వదిన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంజద్‌బాషా పాల్గొని ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలిసో తెలియకో ఏడాదిపాటు చేసిన తప్పులను సమూలంగా కడిగేసే అవకాశం పవిత్రమైన రంజాన్‌ మాసంలో లభిస్తుందన్నారు. ఈ సృష్టిలో ధనదాన్యాలు, ఇతర సౌకర్యాలు అన్నీ దైవం ఇచ్చేనవేనని.. భూమిపై మనదంటూ ఏమీ ఉండదని, కానీ మనిషి అజ్ఞానంతో అన్నీ తానే సాధించినట్లు భ్రమ పడుతున్నాడని.. వాటిలో ఏ ఒక్కటి తిరిగి తీసుకు వెళ్లలేడని తెలుసుకోవాలన్నారు. సర్వమతాల సారం ఒక్కటేనని, ఉపవాస దీక్షలు, ఆరాధన ప్రార్థనల వల్ల మనుషుల్లో ప్రేమ, సోదరభావం, మానవత్వం వంటి సద్గుణాలు పెంపొందుతాయన్నారు. కులమతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు కలిసి ఇఫ్తార్‌ విందుల్లో పాల్గొనడం శుభపరిణామమన్నారు. అల్లాహ్‌ ఆజ్ఞ ప్రకారం ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో రెండున్నర శాతం జకాత్‌ రూపంలో పేదలకు ఖర్చు చేయడం ఈ రంజాన్‌ మాసంలో చేసే పవిత్ర పుణ్యకార్యం అన్నారు. అందుకే ప్రతి మనిషి తనకు ఉన్నంతలో తోటి మనిషికి సాయం అందించే స్వభావాన్ని అలవర్చుకో వాలని కోరారు. ప్రపంచమంతటా శాంతియుతంగా ఉండాలని, దేశం, రాష్ట్రం, జిల్లా, కడప నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మత గురువులు (మౌల్వి) ముష్టి న్యామతుల్లా సాహెబ్‌, దర్గా అమీర్‌, సీనియర్‌ నాయకులు సుభాన్‌ బాషా, మాజీ కార్పొరేటర్లు మహమ్మద్‌ షఫీ, అజ్మతుల్లా ఖాన్‌, వివిధ పార్టీల నాయకులు నజీర్‌ అహ్మద్‌, అమీర్‌ బాబు, వైవీయూ మాజీ రిజిస్ట్రార్‌ గులాం తారీక్‌, మేధావుల విభాగం నగర అధ్యక్షుడు డాక్టర్‌ అస్గర్‌ అలీ, నగర కార్యదర్శి మాస్టర్‌ అహ్మద్‌, ఇస్మాయిల్‌ పాల్గొన్నారు.

మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement