కడప అగ్రికల్చర్ : బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీంతో జిల్లాలో ఈదురుగాలులు, అకాల వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పంట నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఈ నెల 19, 20 తేదీలలో వీచిన ఈదురుగాలులు, అకాల వర్షాలతో జిల్లాలోని వ్యవసాయ, ఉద్యాన పంటలకు భారీ నష్టం జరిగింది. ఇందులో భాగంగా వ్యవసాయ పంటలకు సంబంధించి జిల్లాలోని 6 మండలాల్లో 21 గ్రామాలలో 107 మంది రైతులకు చెందిన 98.40 హెక్టార్ల విస్తీర్ణంలో మొక్కజొన్న, సజ్జ పంటలు దెబ్బతిన్నాయి. అలాగే జిల్లాలోని రాజంపేట, సింహాద్రిపురం, తొండూరు, ముద్దనూరు మండలాల్లో ఉద్యాన పంటలకు సంబంధించి 62 మంది రైతులకు రూ.1.56 కోట్ల మేర నష్టం జరిగింది. ఇంకా మరో 2 రోజుల పాటు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఉన్నట్లుగా వాతావరణ సంస్థ తెలపడం జరిగింది. కావున జిల్లాలోని రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ అధికారులు రైతులకు సూచించారు.
పంటలకు కలిగే నష్టాలు
వర్షాలు అధికంగా కురవడం వల్ల పొలంలో నీరు నిలుస్తుంది. గాలిలో తేమ శాతం పెరగడం వల్ల పూతరాలటం, పంట పెరుగుదల కుంటుపడడంతోపాటు, పంట నాణ్యత కూడా లోపిస్తుంది. చీడ పీడల ఉధృతి పెరుగుతుంది. భూమిలోని పోషకాలు సరిగా మొక్కలకి అందక ఎదుగుదల ఆగిపోతుంది. విత్తనాలు మొలకెత్తకుండా కుళ్లిపోయే అవకాశం ఉంది. సకాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పంట నష్టాన్ని తగ్గించుకోవచ్చు. పలు పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను జిల్లా వ్యవసాయ అధికారి మట్టా సుబ్రమణ్యేశ్వరరావు వివరించారు. వరద అనంతరం కొద్దిపాటి ముంపుకు గురైన పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
● వీలైనంత త్వరగా చేలల్లో అధికంగా ఉన్న నీటిని తీసివేయాలి.
● పంట ఎదుగుదలకు తోడ్పడే విధంగా బూస్టర్ డోస్ ఎరువులను వేసుకోవాలి.
● అధిక తేమ వల్ల ఉధృతి పెరిగే అవకాశం గల తెగుళ్లు, పురుగుల నివారణకు చర్యలు చేపట్టాలి.
● వర్షాలు ఆగిన వెంటనే అంతర సేద్యం చేసి కలుపు తొలగించుకోవాలి.
● నేల కొంచెం ఆరిన తరువాతే రసాయనిక ఎరువులను నేలలో వేసుకోవాలి.
వరి పంటలో..
● వరిలో పాము పొడ నివారణకు హెక్సాకొనజోల్ 2 మిల్లీలీటరు లేక ప్రోపికొనజోల్ 1 మిల్లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
● ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాముల లేక ఐసోప్రోథయొలేన్ 1.5 మి.లీలు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
● తెగుళ్ల ఉధృతి కనిపించట్లయితే ట్రైప్లోక్సీస్ట్రోబిన్ + టేబ్యుకొనజోల్ కలిసిన మందును 0.4 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
● పడిపోయిన కుదళ్లను నిలబెట్టి గుంపులుగా కట్టాలి. గింజ మొలకెత్తకుండా, రంగుమారకుండా లీటరు నీటికి 50 గ్రాముల ఉప్పు కలిపి పిచికారీ చేయాలి.
మొక్కజొన్న పంటకు..
● నిలిచిన నీటిని తీసివేసిన తర్వాత, పంటపై 2 శాతం యూరియా(10 కిలోలు/హెక్టారు) లేదా 1 శాతం పొటాషియం నైట్రేట్ (5 కిలోలు/హెక్టారు) పిచికారీ చేయడం వల్ల పంట త్వరగా కోలుకుంటుంది.
● పడిపోయిన కుదళ్లను నిలబెట్టి గుంపులుగా కట్టాలి.
మినుము, పెసరలలో..
● అధికంగా నిలిచిపోయిన నీటిని బయటికి తీయాలి.
● ఇనుము లోపాన్ని సవరించడానికి, సమర్థంగా పంట కోలుకోవడానికి ఫెర్రస్సల్ఫేట్ 5.0 గ్రా + సిట్రిక్ యాసిడ్ 0.5 గ్రాములు, యూరియా 20 గ్రాములు లీటరు నీటికి పిచికారీ చేయాలి.
● వర్షాలు తగ్గగానే, ఒక వారం తర్వాత, 1 శాతం 19:19:19 లేదా పొటాషియం నైట్రేట్ పిచికారీ చేయాలి.
వేరుశనగకు..
● వేరుశనగలో ఆకుమచ్చ, కాండం కుళ్లు తెగులు ఉధృతి పెరగకుండా హెక్సాకొనజోల్ 2 మి.లీలు/ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
● ఇనుము లోపాన్ని సవరించడానికి ఫెర్రస్‌సల్ఫేట్ 5 గ్రా/లీతోపాటుగా సిట్రిక్ యాసిడ్ 1 గ్రా/లీ పిచికారీ చేయాలి.
● పంట కోతకు సిద్ధంగా ఉన్న చోట వర్షాలు ఆగే వరకు పంటకోత ఆలస్యం చేయాలి.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
మరో 2 రోజులపాటు జిల్లాలో వర్షాలు
జాగ్రత్తలు పాటించాలంటున్న వ్యవసాయ అధికారులు
సూచనలు పాటించాలి
జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురు గాలులతో రైతులు అప్రమత్తంగా ఉండాలి. గాలులు, వర్షాలతో పంటలు దెబ్బతినకుండా ఉండేందుకు ప్రాథమిక సూచనలు, జాగ్రత్తలను ప్రతి రైతు పాటించాలి. దీంతో పంటనష్టం నుంచి సులభంగా రైతులు బయటపడేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి.
– మట్టా సుబ్రమణ్యేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి


