కడప కార్పొరేషన్ : వైఎస్ కుటుంబం మొదటి నుంచి పేద ప్రజల పక్షాన నిలబడి ఆశయాల కోసం పని చేసిన కుటుంబమే గానీ.. ఏనాడూ ఆస్తుల కోసం కొట్లాడుకోలేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిశోర్ బూసిపాటి అన్నారు. అలాంటి కుటుంబంలో చంద్రబాబు చిచ్చుపెట్టి.. షర్మిలమ్మను పావుగా మార్చి ఆస్తుల పేరుతో ఆ కుటుంబాన్ని రోడ్డున పడేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. శనివారం వైఎస్సార్‌సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా వైద్య విభాగం సభ్యులు డాక్టర్ పెంచలయ్యతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు. వైఎస్ కుటుంబంలో అంత మంది సోదరులున్నా.. ఏనాడూ నాకు ఆస్తులు పంచి ఇవ్వాలని గానీ, నా అస్తి నీవు తీసుకున్నావని గానీ కొట్లాడిన సందర్భాలు ఒక్కటి కూడా లేవన్నారు. గతంలో వైఎస్ రాజారెడ్డి, అనంతరం వైఎస్ రాజశేఖరరెడ్డిల మాటే వేదంగా అందరూ ఒక తాటిపై సోదరభావంతో ముందుకు వెళ్లారన్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు ఇచ్చే కాసులు తీసుకొని షర్మిలమ్మ.. వైఎస్ జగన్‌ను రోడ్డుకీడ్చడం వైఎస్ కుటుంబ అభిమానులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తొందన్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడే ఆస్తులు పంచి ఇచ్చినా.. ఇప్పుడు కొత్తగా ఆస్తులు పంచలేదని మాట్లాడటం ఆమెలోని ద్వంద్వ నీతికి నిదర్శనమన్నారు. ఆనాడు ఆస్తులు పంచిన వాస్తవం వైఎస్ విజయమ్మకు తెలిసినా.. ఆమైపె ఒత్తిడి తెచ్చి తప్పుడు లేఖలు విడుదల చేయించడం దారుణమన్నారు. చంద్రబాబునాయుడు ఆడిస్తున్నటువంటి ఆటలో షర్మిల పావుగా మారడం పద్ధతి కాదన్నారు. ఈ రాష్ట్రంలో ఈ రోజు అనేకమైనటువంటి అంశాలు, ప్రజా సమస్యలు పక్కనపెట్టి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీద, ఆయన ఆస్తుల మీద విమర్శలు చెయ్యడం సరైనటువంటి సరికాదని హితవు పలికారు. సొంతమామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు...షర్మిలకు న్యాయం చేయరన్నారు. బాబు ఇచ్చిన కరెన్సీ నోట్లు తీసుకొని సొంత అన్నను విమర్శించడం దుర్మార్గమన్నారు. భవిష్యత్‌లో నీకు ఏదైనా సమస్య వస్తే... అన్నగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తప్ప నిన్ను ఆదుకునేటువంటి వాళ్లు ఎవరూ లేరన్నారు. తెలుగుదేశంపార్టీ ఆడిస్తున్న ఆటలో షర్మిల ఎన్ని చేసినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి నష్టం లేదని, 2029 ఎన్నికల్లో విజయం సాధిస్తుందన్నారు. రాష్ట్రంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడటం.. రెండోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ రాష్ట్రానికి కావడం ఖాయమన్నారు. పనికిమాలిన రాజకీయాలు, ఆలోచనలు, చంద్రబాబు చేసేటువంటి ఎత్తుగడలను షర్మిల అనుసరించవద్దని కోరారు.
ఆస్తుల కోసం ఏనాడూ కొట్లాడలేదు
అంతమంది అన్నదమ్ములున్నా..
ఆస్తుల గొడవలు లేవు
చంద్రబాబుకు పావుగా మారిన షర్మిల వల్లే ఇప్పుడు ఆస్తుల గొడవలు
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిశోర్ బూసిపాటి


