● ముతవల్లి ఆధ్వర్యంలోనే ఖాదర్‌హుస్సేన్ మసీదు కమిటీ నడుస్తోంది
● మసీదు ఎదుట ముతవల్లి
కుటుంబ మహిళల ఆందోళన
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులో ఖాదర్‌హుస్సేన్ మసీదులో పాత కమిటీ ఉండగా కొత్త కమిటీని ఎలా ఏర్పాటు చేస్తారంటూ ముతవల్లీ కుటుంబ మహిళలు ఆందోళన చేశారు. శుక్రవారం నమాజ్ అనంతరం మసీదు ఎదుట బ్యానర్లను చేతపట్టుకొని వారు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖాదర్‌హుస్సేన్ మసీదుకు 100 ఏళ్ల చరిత్ర ఉందన్నారు. నాటి నుంచి నేటి వరకు ఖాదర్‌హుస్సేన్ వంశీయులే ముతవల్లీగా ఉంటున్నారని, ముతవల్లి ఆధ్వర్యంలోనే కమిటీ నడుస్తోందని తెలిపారు. అయితే పాత కమిటీ ఉండగానే కొందరు వ్యక్తులు కుయుక్తులు పన్ని వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో ముతవల్లి లేకుండా కొత్త కమిటీని తెచ్చుకున్నారన్నారు. ఈ కమిటీకి ఎన్‌ఎస్ మున్నా ప్రెసిడెంట్‌గా నియమించుకున్నారని తెలిపారు. రామేశ్వరం రోడ్డులో మున్నాకు చెందిన ఎన్‌ఎస్ ఫంక్షన్ హాల్ స్థానంలో కొత్త మసీదును నిర్మించుకొని ఎన్‌ఎస్ మున్నానే ముతవల్లీగా, కమిటీకి ప్రెసిడెంట్‌గా కొనసాగితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మహిళలు సూచించారు. అయితే ఖాదర్‌హుస్సేన్ మసీదుపై సర్వహక్కులు ఉన్న తమను కాదని వక్ఫ్‌బోర్డు నుంచి తెచ్చుకున్న కొత్త కమిటీని అంగీకరించే ప్రసక్తే లేదని వారు చెప్పారు. 100 ఏళ్లలో వక్ఫ్‌బోర్డు నుంచి ఖాదర్‌హుస్సేన్ మసీదుకు ఒక్క ఇటుక గానీ, సిమెంట్ బస్తా గానీ సహాయం చేయలేదన్నారు. మోడంపల్లె మసీదుకు రూ.100 కోట్ల ఆస్తులు ఉన్నాయని, దానిపై ఎప్పుడైనా విచారణ చేశారా అని ప్రశ్నించారు. ఖాదర్‌హుస్సేన్ మసీదు నుంచి ప్రతి సంవత్సరం ఆషారే షరీఫ్‌నకు గంధం తీసుకెళ్లడం సంప్రదాయంగా వస్తోందన్నారు. అయితే ఈ ఏడాది అంజుమన్ కమిటీ ఆదేశాల మేరకు తమ మసీదు నుంచి గంధం తీసుకెళ్లలేదని పేర్కొన్నారు. మసీదు సంప్రదాయానికి విరుద్ధంగా ఎన్‌ఎస్ మున్నా వారి ఇంటి నుంచి గంధం తీసుకెళ్లారని తెలిపారు. మసీదుకు సంబంధం లేని మున్నా ఫ్యామిలీ వాళ్లు ఎలా గంధం తీసుకెళ్తారని మహిళలు ప్రశ్నించారు. తమ మసీదుపై వారి పెత్తనం ఏంటో అర్థం కావడం లేదన్నారు. ఇంత వరకు ఖాదర్‌హుస్సేన్ మసీదు వక్ఫ్‌బోర్డులో లేదని కొత్తగా కమిటీని తీసుకొచ్చారని అన్నారు. ఏం ఆశించి వాళ్లు ఇదంతా చేస్తున్నారో ప్రజలకు బాగా తెలుసునని తెలిపారు. కొత్త కమిటీ తెచ్చిన విషయం ఇటీవలే వెలుగులోకి వచ్చినట్లు పేర్కొన్నారు. పెద్దలు స్వర్గీయ ఖాదర్‌హుస్సేన్ మసీదు కోసం స్థలం ఇచ్చారని, ఆయన సమాధి కూడా మసీదులోనే ఉందన్నారు. వారి వంశీయులైన తమకే ఈ మసీదుపై సర్వహక్కులు, నిర్వహణా బాధ్యతలు ఉన్నాయని తెలిపారు. ఇదంతా కడప వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్, వక్ఫ్‌బోర్డు స్టేట్ డైరెక్టర్ బేపారి జాకీర్‌లు కుట్ర పన్ని కొత్త కమిటీని తీసుకొచ్చారని ఆరోపించారు. మసీదుపై కన్నేసిన వీళ్లు ఒక్క రోజు కూడా ఇక్కడ ఐదు పూటలా నమాజు చేయలేదన్నారు. ప్రస్తుత ముతవల్లి ఆధ్వర్యంలో ఉన్న కమిటీనే కొనసాగుతుందని, కొత్త కమిటీని అంగీకరించబోమన్నారు. ఇకనైనా కొత్త కమిటీ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.


