మైదుకూరు : గ్రామానికి వెళ్లేందుకు బస్సులో కూర్చున్న వృద్ధురాలు సంచిలోని పర్సులో ఉంచిన బంగారం గొలుసు చోరీకి గురైన సంఘటన మైదుకూరులో శుక్రవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మైదుకూరు మండలం తిప్పిరెడ్డిపల్లెకు చెందిన లక్షుమ్మ అనే వృద్ధురాలు శుక్రవారం ఉదయం మైదుకూరు బస్టాండ్‌లో పోరుమామిళ్ల వెళ్లే బస్సు ఎక్కింది. కండక్టర్‌కు ఆధార్ కార్డు చూపించేందుకు బ్యాగులో చూడగా.. అందులో ఉంచిన పర్సు జిప్ తీసి కనిపించింది. ఆందోళనతో పర్సులో చూడగా అందులో ఉంచిన రెండు తులాల బరువున్న బంగారు గొలుసు కనిపించలేదు. ఆమెబీ లబోదిబోమంటూ బస్సు దిగి బస్టాండ్ అంతా వెతికింది. వృద్ధురాలి రోదన చూసి తోటి ప్రయాణికులు కూడా బంగారం గొలుసు కోసం గాలించారు. కనిపించక పోవడంతో దొంగలు దొంగలించి ఉంటారని అందరూ భావించారు. సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
జూదరుల అరెస్ట్
వీరపునాయునిపల్లె : మండలంలోని సంగమేశ్వర దేవాలయం తూర్పు భాగంలో ఉన్న కంప చెట్లలో జూదమాడుతున్న జూదరులను అరెస్టు చేసినట్లు ఎస్సై క్రిష్ణయ్య తెలిపారు. ఏడుగురు జూదమాడుతున్నట్లు సమాచారం అందిందని, వెంటనే తమ సిబ్బందితో వెళ్లి దాడి చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు మిగిలిన నలుగురు పరారయినట్లు చెప్పారు. వారి వద్ద నుంచి 7400 రూపాయలు నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. పారిపోయిన నలుగురు వ్యక్తులపైన కూడా కేసు నమోదు చేయడం జరిగిందని వివరించారు.
గాయపడిన వ్యక్తి మృతి
ఎర్రగుంట్ల : డాక్టరు ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో పని చేస్తున్న ఉద్యోగి బడుగు త్యాగరాజు(45) చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారని కలమల్ల ఎస్‌ఐ సునీల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆర్టీపీపీలో డ్యూటీకి వెళ్తున్న సమయంలో స్కూటర్ వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో త్యాగరాజు తలకు బలమైన గాయం అయింది. వెంటనే చికిత్స కోసం ప్రొద్దుటూరు నుంచి కర్నూలు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ త్యాగరాజు మృతి చెందారని ఎస్‌ఐ తెలిపారు. మృతుడి బంధువులిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


