● అర్చకుల మధ్య ముదిరిన వివాదం
● ఉదయాన్నే సమర్పించాల్సిన నైవేద్యం
11 గంటలకు పెట్టిన వైనం
చక్రాయపేట : పవిత్ర పుణ్యక్షేత్రం గండి వీరాంజనేయస్వామి సన్నిధిలో శుక్రవారం పూట అపచారం జరిగిందని చెప్పవచ్చు. ఇద్దరు అర్చకుల మధ్య గురువారం ఉగాది నాడు జరిగిన సంఘటన ఈ అనర్థానికి దారి తీసింది. ఇప్నటికే ఎన్నో మార్లు స్వామి పరువును బజారు కీడ్చిన అర్చకులు.. తమ పద్ధతులు మార్చుకోక పోగా ఏకంగా స్వామి వారికి నైవేద్యం పెట్టకుండా వదిలేశారు. ఈ విషయం బయటికి పొక్కడంతో 11 గంటల సమయంలో స్వామికి నైవేద్యం పెట్టి మమ అనిపించారు. దీంతో భక్తులు అర్చకుల తీరుపై మండి పడుతున్నారు. కొందరు భక్తులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వాస్తవంగా ఆలయంలో భక్తులు హారతి పల్లెంలో వేసే కానుకలు తీసి హుండీలో వేయాలి. కానీ ఇక్కడ ప్రధాన, ఉప ప్రధాన అర్చకులే అమావాస్య నుంచి పౌర్ణమి వరకు ఒకరు.. పౌర్ణమి నుంచి అమావాస్య వరకు మరొకరు హారతి పల్లెం కానుకలు తీసుకోవాలని ఒప్పందం చేసుకున్నారు. ఆ మేరకు గత కొన్నేళ్లుగా అధికారులు, పాలక మండలి సభ్యుల సమక్షంలో పంపకాలు చేసుకున్నారు. ఈ పంపకమే శుక్రవారం స్వామి వారికి నైవేద్యం అందకుండా చేయడానికి కారణమైంది. ఎందుకంటే అమావాస్య గురువారం ఉదయం 7 గంటలకు పోయి పాడ్యమి వచ్చింది కనుక ఇక తాను తీసుకుంటాను అని ఉప ప్రధాన అర్చకుడు రాజా రమేష్ ప్రధాన అర్చకుడు కేసరిని అడిగారు. ఇందుకు ఈ రోజంతా నేనే ఉంటా వదిలే ప్రసక్తే లేదని ప్రధాన అర్చకుడు ఖరాకండిగా చెప్పాడు. దీంతో ఉప ప్రధాన అర్చకుడు పలువురి ద్వారా ప్రధాన అర్చకుడిని ఒప్పించే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు.
ప్రధాన అర్చకుడి తీరుపై బీటెక్ రవికి ఫిర్యాదు
‘ఇక నుంచి ప్రతి రోజు నీవే తీసుకో’ అంటూ అలిగి వెళ్లిన ఉప ప్రధాన అర్చకుడు నేరుగా నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ బీటెక్ రవిని కలసి తమకు ప్రధాన అర్చకుడి ద్వారా జరిగిన అన్యాయంతోపాటు ఆయన అక్రమాలను వివరించారు. దీంతో బీటెక్ రవి ప్రధాన అర్చకుడి తీరుపై మండి పడి వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆలయ మాజీ చైర్మన్ వెంకటస్వామికి సూచించారు. వినక పోతే సీఐకి ఫోన్ చేస్తానని కూడా టీడీపీ ఇన్‌చార్జ్ ఘాటుగా స్పందించినట్లు సమాచారం. ఇది గురువారం జరిగిన తతంగం. ఇక శుక్రవారం నాటి కథ చూస్తే ప్రధాన అర్చకుడు తన కుమార్తె ఇంట్లో ఫంక్షన్ అని చెప్పి ఉప ప్రధాన అర్చకుడికి ఇవ్వాల్సిన తాళాలు మరో అర్చకుడి చేతికి ఇచ్చి వెళ్లి పోయాడు. తాను ఇకపై అన్నీ నీవే చూసుకో అని చెప్పానని చెప్పి మిన్నకుండి పోయాడు. తాళాలు తీసుకున్న మరో అర్చకుడు మాత్రం ఉదయాన్నే గుడికి వెళ్లి అన్ని కై ంకర్యాలు పూర్తి చేసి నైవేద్యం కోసం ఎదురు చూశాడు. నైవేద్యం రాక పోవడంతో ఆయన చేసేదేమీలేక మిన్నకుండి పోయాడు. ఈ విషయం తెలుసుకున్న ఆలయ మాజీ చైర్మన్ మరి కొందరు సిబ్బంది ఉప ప్రధాన అర్చకుడి వద్దకు వెళ్లి ప్రాధేయ పడి ఉదయం పెట్టాల్సిన నైవేద్యాన్ని 11 గంటల సమయంలో పెట్టించారు. ఈ విషయం బయటికి పొక్కడంతో భక్తులు అర్చకుల తీరుపై మండి పడుతున్నారు. అధికారులకు వాటాలు ఉన్నందునే హారతి పల్లెంపై ఎన్ని విమర్శలు వచ్చినా, అర్చకులు కొట్టుకొని బజారుకెక్కినా పట్టించుకోలేదనే బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి. ఆలయ బాధ్యతలను ఇన్‌చార్జ్ అధికారిగా పర్యవేక్షిస్తున్న డిప్యూటీ కమిషనర్ గురుప్రసాద్ ఈ విషయంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని భక్తులు పేర్కొంటున్నారు.


