కష్టించి.. విజేతలుగా నిలిచి..
వారంతా వివిధ నేపథ్యాలు కలిగిన వారు.
కష్టపడి చదివారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్–1 ఫలితాల్లో ప్రతిభతో మెరిశారు.
అనుకున్నలక్ష్యం మేరకు విజేతలుగా నిలిచారు.
జమ్మలమడుగు : ఐపీఎస్ సాధించాలన్నదే తన లక్ష్యమని గ్రూప్ 1 విజేత అల్లూరు మహమ్మద్ ఖదీర్ అన్నారు. 2018 నుంచి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఖదీర్ ఇప్పటివరకు మూడు సార్లు యూపీఎస్‌సీ రాయగా.. అందులో రెండు సార్లు మెయిన్స్ అర్హత సాధించాడు. మరో మూడు అవకాశాలు ఉన్నాయని..ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకునే దిశగా అడుగులు వేస్తానని పేర్కొన్నాడు. కాగా ఇదివరకు రెండు సార్లు గ్రూప్ 1లో విజేతగా నిలిచిన ఖదీర్ తాజా గ్రూప్–1 ఫలితాల్లో డీఎస్పీగా ఎంపికై శభాష్ అనిపించారు. ఈ నేపథ్యంలో ఆయనతో చేసిన చిరు ఇంటర్వ్యూ.
? ఓ వైపు ఉద్యోగం..మరోవైపు ప్రిపరేషన్..
ఎలా సమన్వయం చేస్తున్నారు
ఉద్యోగ వేళలు ముగిశాక రోజుకు ఐదునుంచి ఆరు గంటల వరకు చదువుతాను. ఇప్పటికే రెండు సార్లు గ్రూప్–1పోస్టులు సాధించా. తొలిసారి 2022లో గ్రూప్ –1లో ఎంపీడీఓగా పోస్టు సాధించి అన్నమయ్య జిల్లాలో కె.వి.పల్లిలో చేశా.అనంతరం 2024లో అసిస్టెంట్ అడిట్ ఆఫీసర్‌గా పోస్టు సాధించి అమరావతిలో పనిచేస్తున్నా. తాజా ఫలితాల్లో డీఎస్పీగా సెలెక్టు అయ్యాను.
? డీఎస్పీ పోస్టుతోనే ఆగిపోతారా
సివిల్స్ రాయాలనే ఆలోచన ఉందా..
సివిల్స్‌కు ఎంపికై ఐపీఎస్ కావాలన్నదే నా లక్ష్యం. అందుకోసం ప్రిపరేషన్ కూడా చేస్తున్నాను. ఇప్పటికే మూడు సార్లు యుపిఎస్‌సీ పరీక్షలు రాశాను. రెండు సార్లు మెయిన్స్‌కు అర్హత సాధించాను. మరో సారి ప్రయత్నం చేస్తాను.
? కోచింగ్ ఎక్కడైనా తీసుకుంటున్నారా..
2019–2022 వరకు ఢిల్లీలోని వాజిరామ్ ఇన్‌స్టిట్యూట్‌లో కోచింగ్ తీసుకుని జామియామిలియా ఇస్తామియా యూనివర్శిటిలో ప్రిపరేషన్ చేశాను.అక్కడ తీసుకున్న కోచింగ్‌తోనే మూడు సార్లు గ్రూప్–1 పోస్టులు సాధించాను.
? ఈ ప్రయాణంలో మీకు స్ఫూర్తి ఎవరు
డీఎస్పీ పోస్టు సాధించటానికి స్పూర్తి మా కుటుంబ సభ్యులు. మా నాన్న నజీర్ అహమ్మద్ న్యాయవాది, మా చిన్నాన్న పోలీసుకావడంతోనే సమాజానికి ఉపయోగపడాలి అనే భావనతో డీఎస్పీ కావటానికి ప్రయత్నం చేశాను.
? మీ విద్యాభ్యాసం ఎక్కడ సాగింది
ప్రాథమిక విద్య స్థానికంగా జరిగినా ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తిగా హైదరాబాద్‌లో జరిగింది. అక్కడ ఆర్ట్స్ గ్రూపు తీసుకుని అప్పటినుంచే గ్రూప్స్, యూపీపీఎస్‌సీ ప్రిపరేషన్ మొదలు పెట్టాను. మొత్తం 8 ఏళ్లు కష్టపడి డీఎస్పీ పోస్టు సాధించాను.
? ప్రస్తుతం ప్రిపరేషన్ అవుతున్న వారికి
మీరిచ్చే సలహా..
ఎన్ని గంటలు చదివిన ఎంచుకున్న సబ్జెక్టులపై పూర్తిగా పట్టుసాధించాలి. పాత సివిల్స్ పేపర్ ఆన్‌లైన్‌లో చూసి ప్రిపరేషన్‌తోపాటు, ప్రముఖుల రాసిన పుస్తకాలను, తెలుగు, ఇంగ్లీషు పత్రికలు బాగా చదవాలి. ముందు మన కష్టం ఉండాలి. ఫలితం దైవం నిర్ణయిస్తుంది.
ఐపీస్ సాధించడమే లక్ష్యం: ఖదీర్
కష్టించి.. విజేతలుగా నిలిచి..


