రెడ్‌ బుక్‌.. బ్లడ్‌ బుక్‌గా మారింది | - | Sakshi
Sakshi News home page

రెడ్‌ బుక్‌.. బ్లడ్‌ బుక్‌గా మారింది

Feb 3 2026 7:43 AM | Updated on Feb 3 2026 7:43 AM

రెడ్‌ బుక్‌.. బ్లడ్‌ బుక్‌గా మారింది

రెడ్‌ బుక్‌.. బ్లడ్‌ బుక్‌గా మారింది

రాష్ట్రం రావణ కాష్టంలా ఉంది

మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి

ప్రొద్దుటూరు : కూటమి నేతలు, కార్యకర్తలతో రాష్ట్రం రావణ కాష్టంలా మారిందని వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లల్లోకి చొరబడి మహిళలను భయబ్రాంతులకు గురి చేయడం, ఇళ్లను పెట్రోలు బాంబులతో తగలబెట్టుతున్నారని, రెడ్‌ బుక్‌, బ్లడ్‌ బుక్‌ అయ్యిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ఆయన సోమవారం వైఎస్సార్‌ కడప జిల్లా ప్రొద్దుటూరులోని తన స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలీసుల సమక్షంలోనే ఈ దాడులు జరుగుతుండటం బాధాకరమని అన్నారు. తమ పార్టీ నేతల ఇళ్లపై దాడులు చేస్తుంటే కనీసం పోలీసులు అరికట్టే ప్రయత్నం చేయలేదన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిలోకి పోలీసులు చొరబడుతున్నా పోలీసులు స్వయంగా కళ్లప్పగించి చూశారే తప్ప నివారించలేకపోయారన్నారు. పోలీసుల సాక్షిగా ఈ దాడులు జరగడాన్ని జీర్ణించుకోలేకున్నామని చెప్పారు. లోకేష్‌ రాజకీయ బాధ్యతలను తీసుకుని రెడ్‌బుక్‌ కాస్తా బ్లడ్‌ బుక్‌గా మార్చారన్నారు. రాష్ట్రంలో రాజకీయ నాయకులకు, వారి ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని తెలిపారు. ప్రజాస్వామ్య వాదులంతా ఈ సంఘటనలను ఖండిస్తున్నారన్నారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని చంద్రబాబు చెప్పిన అబద్ధపు మాటలను చూసి అందరూ ఆశ్చర్యపోయారన్నారు. ఈ సంఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు, పోలీసులు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధికారంలో ఉండగా చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌తోపాటు మంత్రులు తమ నోటికి వచ్చినట్లు ఎమ్మెల్యేలను కొడకల్లారా ఏం పెరుకుతారని మాట్లాడినా అప్పట్లో తమ ముఖ్యమంత్రి జగన్‌ చర్యలు తీసుకోలేదన్నారు.

పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కల్తీ జరిగిందని నిరాధారణ ఆరోపణలను చేసి చంద్రబాబు రావణ కాష్టానికి బీజం వేశారని రాచమల్లు తెలిపారు. ఆనాడు వైఎస్‌ జగన్‌ ఈ ఘటనపై మౌనం దాల్చారని, 20 నెలల తర్వాత వాస్తవాలు వెలుగులోకి వచ్చాయన్నారు. లడ్డూలో జంతువుల కొవ్వు కల్తీ జరగనందుకు వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవాల్సింది పోయి సీఎం చంద్రబాబు పచ్చ మూకలను రెచ్చగొట్టారన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం లడ్డూ ప్రసాదాన్ని వాడుకుంటున్నారన్నారు. కల్తీ నెయ్యి అని చెప్పి గొడవలకు మళ్లీ శ్రీకారం చుట్టారని తెలిపారు. దీనిని డైవర్ట్‌ చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా మహా పాపం నిజం అని ఫ్లెక్సీలు వేశారన్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు ప్రశ్నిస్తే రెడ్‌ బుక్‌ ద్వారా కేసులు పెట్టారన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇదే ప్రశ్నించారన్నారు. ఈ సంఘటనలో టీడీపీ గుండాలకు పోలీసులు రక్షణగా నిలిచారన్నారు. అంబటి కారుపై దాడి చేయడంతోపాటు బూతులు తిట్టారన్నారు. జగన్‌ను దూషించిన తర్వాతే అంబటి రాంబాబు మాట్లాడారన్నారు. చంద్రబాబు, లోకేష్‌ ఆదేశాలతోనే అంబటి ఇంటిపై దాడులు జరిగాయని చెప్పారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు భాషే రాదని టీడీపీ నాయకులు చెబుతున్నారన్నారు.

చంద్రబాబు మొదలు మంత్రులంతా దూషణలే

జగన్‌ ప్రభుత్వంలోనే చంద్రబాబు నీ పుట్టుకే తప్పుడు పుట్టుక, మీ అమ్మ మొగుడు ఇచ్చాడా, మీ అమ్మమ్మ మొగుడు ఇచ్చాడా, మీ నాయనమ్మ మొగుడు ఇచ్చాడా అని విమర్శించినా ఆనాడు చర్యలు తీసుకోలేదని రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. జగన్‌ ఓర్పుతో ఉండటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ వైస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుండా కొడుకులు ఎంత మంది వస్తారో రండి అని దూషించారన్నారు. హోం మంత్రి అనిత మాట్లాడిన మాటలు చూసి మహిళలు సిగ్గుతో తలదించుకుంటున్నారన్నారు. మడకశిర ఎమ్మెల్యే బండారు శ్రావణి కూడా అలాగే మాట్లాడారన్నారు. స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, మంత్రి అచ్చెన్నాయుడు, పట్టాభిరామ్‌, బచ్చుల అర్జునుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలా ఎందరో జగన్‌ను స్వయంగా దూషించారన్నారు. ఇప్పుడు కేవలం ఒక్క మాట మాట్లాడినందుకే అంబటి రాంబాబుపై హత్యాయత్నం చేశారన్నారు. కేవలం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని జగన్‌ ఆనాడు తమను నిలువరింపజేశారన్నారు. ఇప్పుడు రెడ్‌ బుక్‌ను బ్లడ్‌ బుక్‌గా మార్చి రక్త చరిత్ర రాస్తున్నారని విమర్శించారు. పోలీసులు శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని, చంద్రబాబు రక్త చరిత్రను మానుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు. తప్పుడు భాష మాట్లాడకుండా తమ పార్టీ నేతలకు బోధించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement