మున్సిపల్ కమిషనర్‌పై ఎమ్మెల్యే ఆగ్రహం
ప్రొద్దుటూరు : మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, అధికారులపై ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీతాలు తీసుకుంటే సరిపోదని, తనతో సహా ప్రతి ఒక్క అధికారి ప్రజలకు జవాబుదారిగా ఉండాలన్నారు. మున్సిపల్ పెట్రోలు బంకులో రూ.కోటి 23 లక్షల అవినీతి జరిగితే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డిని ప్రశ్నించారు. కమిషనర్ పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. పత్రికల్లో రోజూ కథనాలు వస్తుంటే సిగ్గు అనిపించలేదా అన్నారు. రిటైర్డు అయిన ఉద్యోగులకు జీతాలు ఇచ్చిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని మున్సిపల్ ఆర్డీని ఫోన్ ద్వారా అడిగారు. మున్సిపల్ పెట్రోల్ బంకులో జరిగిన అవినీతిపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారన్నారు. ఇంత అధ్వానమైన పనితీరు కలిగిన అధికారులను ఎప్పుడూ చూడలేదని కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.


