ఉపాధ్యాయుల సమస్యలు మంత్రి లోకేష్ దృష్టికి
● ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి
● ఎస్టీయూ ఆధ్వర్యంలో మహా ర్యాలీ
ర్యాలీలో పాల్గొన్న ఎస్టీయూ నాయకులు
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి
కడప ఎడ్యుకేషన్ : పాఠశాలల్లో బోధనేతర కార్యక్రమాల వలన ఉపాధ్యాయులు బోధనకు దూరం అవుతున్నారనే విమర్శ ఎక్కువగా ఉందని ఈ విషయాన్ని మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తానని పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం కడప నగరంలో ఆర్ట్స్ కాలేజ్ నుంచి జిల్లా పరిషత్తు వరకు ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేలాది మంది ఉపాధ్యాయులు మహా ర్యాలీ నిర్వహించారు. అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన విద్యా సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ మాట్లాడుతూ విద్యారంగం, ఉపాధ్యాయల అభ్యున్నతికి ఎస్టీయూ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ అర్హత పరీక్ష పై ఆందోళన చెందవద్దని రాష్ట్ర ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేసి 2011 కంటే ముందు ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన వారికి టెట్ నుంచి మినహాయింపు వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు తీసుకుని సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటామని తెలిపారు.
ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాలు విద్యా సంవత్సరం మధ్యలో తీసుకొస్తున్న సంస్కరణల వల్ల విద్యా సంవత్సరం కుంటుపడుతోందని చెప్పారు. ప్రయోగాలు సత్ఫలితాలు ఇవ్వడం లేదని అన్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు ప్రభుత్వాలు ఆలోచించాలన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలు చూస్తుంటే ప్రపంచ బ్యాంకు షరతులకు తలొగ్గి ఉచిత విద్య నుంచి ప్రభుత్వం తప్పుకునేలా పావులు కదుపుతోందన్నారు. జీఓ 117కు ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిన 21 జీఓను సవరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొర్రా సురేష్ బాబు, గాజుల నాగేశ్వరరావు, కోటేశ్వరరావు, సుబ్రహ్మణ్యం రాజు, జోసెఫ్ సుధీర్ బాబు, తిమ్మన్న, జనవిజ్ఞాన వేదిక నాయకులు విశ్వనాథం, సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థి విభాగం నాయకుడు వలరాజు, ఎస్టీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సంగమేశ్వరరెడ్డి, పాలకొండయ్య, రాష్ట్ర నాయకులు కంఘం బాలగంగిరెడ్డి, పిల్లి రమణారెడ్డి, రవిశంకర్‌రెడ్డి, కొత్తపల్లి శీను, బండి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల సమస్యలు మంత్రి లోకేష్ దృష్టికి


