కేసీ కాలువలో మృతదేహం
మైదుకూరు : మైదుకూరు వద్ద కడప – కర్నూలు (కేసీ)కాలువలో ఆదివారం మృతదేహం కనిపించింది. ఉదయం అటుగా వెళ్లిన కొందరికి మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఆ మేరకు అర్బన్ సీఐ కె.రమణారెడ్డి మృతదేహం ఆచూకీపై వివరించారు. మృతుడు చాపాడు మండలం నాగాయపల్లెకు చెందిన పిచ్చపాటి వీరప్రభాకర్‌రెడ్డి (38)గా గుర్తించారు. ఆయన ఈనెల 11వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపినట్టు సీఐ పేర్కొన్నారు. ప్రొద్దుటూరు రోడ్డులో ఉన్న కేసీ కెనాల్ నీటిలో ప్రమాదవశాత్తు పడి చనిపోయినట్టు తెలిపారు. మృతుని భార్య సుభద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
నిలకడగా విద్యార్థుల ఆరోగ్యం
తొండూరు : తొండూరు మండలం అగడూరు పంచాయతీ పరిధిలో గల యాదవారిపల్లె ప్రాథమిక పాఠశాలలో శనివారం జరిగిన ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఆదివారం పులివెందుల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి విలేకరుల బృందంగా వెళ్లి.. అక్కడి వైద్యులు, విద్యార్థుల తల్లిదండ్రులతో వివరాలు తెలుసుకోగా, ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారన్నారు. సోమవారం విద్యార్థులను డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు.
బైక్‌లు ఢీ
ముద్దనూరు : స్థానిక పోలీసు స్టేషన్ ముందు ఆదివారం సాయంత్రం ఎదురెదురుగా వస్తున్న మోటార్ బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరికి కాలువిరగగా, మరొకరికి తలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
సిద్దవటం మండలాన్ని కడప జిల్లాలోనే కొనసాగించాలి
కడప కార్పొరేషన్ : సిద్దవటం మండలాన్ని వైఎస్సార్ కడప జిల్లాలోనే కొనసాగించాలని జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు మధుసూదన్, లక్ష్మినారాయణ, దిలీప్‌రెడ్డి కోరారు. ఆదివారం వారు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డికి వినతి పత్రం సమర్పించి మద్దతు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడపకు కూతవేటు దూరంలోనే సిద్దవటం ఉందని, దీన్ని అన్నమయ్య జిల్లాకు మారిస్తే 80.కి.మీ చుట్టూ తిరిగి జిల్లా కేంద్రమైన రాయచోటికి వెళ్లాల్సి ఉంటుందన్నారు. 2009లో కడప అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాజంపేట నియోజకవర్గంలో కలిసి చాలా కోల్పోయామని, ఎంతో చరిత్ర కలిగిన ఒక నాటి జిల్లా కేంద్రాన్ని మరింత దిగజార్చవద్దని కోరారు.
ఒంటిమిట్ట వద్ద చెరువులోకి దూసుకెళ్లిన కారు
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట మండలంలోని సాలాబాదు క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం ఉదయం ఒంటిమిట్ట చెరువులోకి కారు దూసుకెళ్లింది. పోలీసుల వివరాల మేరకు.. కర్నూలులోని నిర్మల్ నగర్‌కు చెందిన శ్రావణ్‌కుమార్ కుటుంబ సభ్యులు మరో ముగ్గురు కారులో తిరుమలకు వెళ్లి వస్తున్నారు. ఒంటిమిట్ట చెరువు కట్టపైకి రాగానే కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తూ కారుకు తుమ్మచెట్లు అడ్డుపడటంతో చెరువులో మునగలేదు. ప్రమాదం తప్పింది.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
చిట్వేలి : ఆరుగాలం కష్టించి పండించిన పంటలు పండక, పెట్టిన పెట్టుబడులు రాక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన చిట్వేలి మండలంలో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధిలోని జట్టువారిపల్లికి చెందిన ఏదోటి సుబ్బరాయుడు (48) కౌలుకు 15 ఎకరాలలో బొప్పాయి,అరటి సాగు చేస్తున్నాడు. పండించిన పంటలు పండక, పెట్టుబడి రాక అప్పుల బాధతో శనివారం విషపు గుళికలు మింగాడు. రేణిగుంట ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.
కేసీ కాలువలో మృతదేహం
కేసీ కాలువలో మృతదేహం
కేసీ కాలువలో మృతదేహం


