లాభాల మునగ.!
కడప సిటీ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రకరకాల పండ్ల తోటల పెంపకానికి కేంద్ర ప్రభుత్వం నిధులను ఖర్చు చేస్తోంది. 300 రకాల వ్యాధులకు ఉపయోగపడే మునగ (మోరింగా) సాగుకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో మునగ సాగుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. జిల్లాలోని ఆరు మండలాల్లో మునగ సాగును చేపట్టారు. ప్రారంభంలో కేవలం 23 మంది రైతులు మాత్రమే 17.43 ఎకరాల్లో 710 మొక్కలు మాత్రమే నాటారు. పూర్తిగా రైతుకు ఎలాంటి భారం లేకుండా గుంతలు తీసే పని నుంచి మొక్కల పంపిణీ రెండు సంవత్సరాలపాటు నిర్వహణ కూడా పూర్తి ఉచితంగానే కేంద్ర ప్రభుత్వం రైతులకు అవకాశం కల్పిస్తోంది. అఽధిక పోషక విలువలతోపాటు ఔషధ గుణాలు కూడా మునగ మొక్కల్లో ఎక్కువగా ఉన్నాయి. హోస్టెడ్ ప్లాంటేషన్ ద్వారా నర్సరీల్లో పెంచిన మునగ మొక్కలను రైతులకు అందజేస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో కూడా నాటించి విద్యార్థులకు మునగతో ఏ విధంగా ఉపయోగం ఉందో తెలియజేసే విధంగా చర్యలు తీసుకున్నారు.
జిల్లా వ్యాప్తంగా 31.61 ఎకరాల గుర్తింపు..
జిల్లా వ్యాప్తంగా ఆరు మండలాల్లో ఈ మునగసాగు చేపట్టారు. ఇందులో భాగంగా 31మంది రైతులకు 31.61 ఎకరాలు గుర్తించారు. 14,190 గుంతలు తీయగా, ఇందులో 29.7 ఎకరాల్లో సాగై 11,850 మొక్కలు నాటారు. రెండు సంవత్సరాలపాటు ఈ పంట ఉంటోంది. తర్వాత సాగు చేసిన రైతులకు రెండవ దఫా ఇచ్చేందుకు అవకాశం ఉండదు. 0.5 ఎకరా నుంచి ఎకరా వరకు నాటేందుకు అనుమతి ఉంది.
రెండింతలకుపైగా ఆదాయం..
కొత్తగా రైతులు ప్రారంభంలో మొగ్గు చూపకపోయినా తర్వాత అధికారులు ఆదాయం రెండింతలు వస్తుందని చెప్పగా రైతులు ముందుకు వచ్చారు. సున్నా పెట్టుబడితో కేంద్ర ప్రభుత్వం వీటికి అయ్యే ఖర్చు ఉచితంగానే నిధులు ఇస్తోంది. రైతు చేతి నుంచి ఒక్క రూపాయి కూడా వెచ్చించాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు ఒక రైతు ఎకరాకు కేంద్ర ప్రభుత్వం మొక్కలు, మెటీరియల్‌కు కలిపి రూ. 80 వేలు ఉచితంగా ఇవ్వగా, ఆ రైతుకు రెండు సంవత్సరాల కాలంలో రూ.3.50 లక్షల ఆదాయం అందుతోందని గణాంకాలు చెబుతున్నాయి.
మునగ ఆకుతో 300 వ్యాధులు దూరం..
మునగ ఆకు, మునక్కాయలు మనం నిత్యం తినే ఆహారమేగానీ, దాని గురించి ప్రజల్లో పూర్తిగా అవగాహన లేదు. అయితే మునక్కాయలే కాకుండా మునగ ఆకులో కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వివిధ పరిశోధనల్లో వెల్లడైంది. మునగ ఆకులో ఏ, సీ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేదంలో అయితే 300 వ్యాఽ ధులు నయం చేసేందుకు మునగ ఆకును ఉపయోగిస్తారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. క్యారెట్ తింటే వచ్చే విటమిన్లు 8–10 రెట్లు అధికంగా మునగ ఆకు ద్వారా పొందవచ్చు. కళ్ల వ్యాధులకు సంబంధించి మందుల్లో కూడా వాడతారు. మహిళలు రోజుకు ఏడు గ్రాముల మునగ ఆకు పొడిని మూడు నెలలపాటు వరుసగా తీసుకుంటే 13.5 శాతం బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయని పరిశోధనలో కూడా తేల్చారు. థైరాయిడ్‌కు మంచి మందుగా పనిచేస్తుంది. మునగాకు రసాన్ని పిల్లలకు అందిస్తే ఎముకలు బలిష్టంగా ఉంటాయి. పాలిచ్చే తల్లులకు పాలు పెరిగేందుకు మునగాకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకు 100 గ్రాముల మునగాకులో నీరు 75.9 శాతం, పిండి పదార్థాలు 13.4 గ్రాములు, కొవ్వు పదార్థాలు 17 గ్రాములు, మాంసకృత్తులు 6.7 గ్రాములు, క్యాల్షియం 440 మిల్లీ గ్రాములు, పాస్పరస్ 70 మి.గ్రా. ఐరన్ 7 మి.గ్రా, సి–విటమిన్ 200 మిల్లీ గ్రాములు, ఖనిజ లవణాలు 2.3 శాతం, పీచు పదార్థం 0.9 మిల్లీ గ్రాములు, ఎనర్జీ 97 క్యాలరీల పోషక పదార్థాలు కలిగి ఉంటుంది.
మునగ సాగుతో ఆరోగ్యం.. ఆదాయం
సాగు చేసుకునేందుకు ముందుకొస్తున్న రైతులు
ఉపాధి హామీలో పూర్తిగా ఉచితంగా గుంతలు, మొక్కలు అందజేత
లాభాల మునగ.!


