ఆదీ.. నీ బతుకంతా అబద్ధాలే!
జమ్మలమడుగు : ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డీ.. నీ బతుకంతా అబద్ధాలతోనే సాగుతోంది.. అని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి ఘాటుగా విమర్శించారు. ఆదివారం జమ్మలమడుగులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆది బెదిరింపులకు భయపడేవారు ఇక్కడ ఎవ్వరూ లేరన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు నిజాయితీగా జరిగాయని, రాబోయే ఎన్నికల్లో పులివెందుల మున్సిపాలిటీని ముఖ్యమంత్రికి గిఫ్టుగా ఇస్తామని ప్రగల్భాలు పలుకుతున్నాడన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు ఎంత సజావుగా జరిగాయో రాష్ట్ర ప్రజలందరూ ప్రత్యక్షంగా చూశారన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి వేలాది మంది అక్కడ దొంగ ఓట్లు వేసి వచ్చారన్నారు. సాక్షాత్తు కలెక్టర్ సమక్షంలోనే దొంగ ఓట్లు వేసిన చరిత్ర ప్రజలందరికీ తెలుసన్నారు. ఆది అంటే అవినీతి, అబద్ధం అని ఎద్దేవా చేశారు. రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే స్థాయి గాని అర్హత గాని ఆదినారాయణరెడ్డికి లేవన్నారు. ఆదిలాంటి అవినీతి, దగాకోరు రాజకీయ నాయకులు ఎవరూ లేరన్నారు. అధికారం ఎక్కడ ఉంటే అటువైపు పరుగులు తీసే మనస్తత్వం కలిగిన నీచ చరిత్ర అందరికీ తెలుసన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చిత్రావతి, పెన్నానది, ఫ్యాక్టరీల వద్ద కమీషన్లు దండుకుంటూ, ఫ్లైయాష్‌ను దోచుకుంటూ నెలకు మూడు కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాడని ఆరోపించారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కచ్చితంగా వైఎస్సార్‌సీపీ తరపున అభ్యర్థులను పోటీలో నిలిపి తీరుతామని, ఎలాంటి బెదిరింపులు, దౌర్జన్యాలనైనా ధీటుగా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులకు రాబోయే ఎన్నికల్లో సూదులతో గుచ్చుతా అని ఆదినారాయణరెడ్డి అంటున్నాడని, అయితే ప్రజలు 2029 ఎన్నికల్లో నీకు సూది వేసి శాశ్వతంగా రాజకీయ సమాధి చేస్తారన్నారు. ఇప్పటికై నా ఆదినారాయణరెడ్డి తన స్థాయి తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి హితవు పలికారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ అధికారప్రతినిధి కొమెర్ల మోహన్‌రెడ్డి, పొన్నపురెడ్డి గిరిధర్‌రెడ్డి, జగదీశ్వరరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ సింగరయ్య, కౌన్సిలర్ ముల్లాజానీ, విష్ణువర్దన్‌రెడ్డి, వద్దిరాల రామాంజనేయులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి


