● కల్యాణ వైభోగమే..
● కనుల పండువగా శ్రీనివాస కల్యాణం
● మార్మోగిన గోవింద నామస్మరణ
ప్రొద్దుటూరు కల్చరల్ : తిరుమల తిరుపతి దేవస్థానం పర్యవేక్షణలో గోవిందమాల భక్త బృందం ఆధ్వర్యంలో అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో శనివారం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు సప్తశైల వాసుడైన శ్రీనివాసుని కల్యాణం వైభవంగా జరిగింది. ప్రత్యేకంగా ఆలయం నమూనాతో రూపొందించి రంగురంగుల పూలతో అలంకరించిన కల్యాణ వేదికపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవ మూర్తులను కొలువుదీర్చారు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు చెందిన వేదపండితులు దేవతా మూర్తులకు విశేష పూజాకార్యక్రమాలను నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. రుత్వికుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య స్వామివారి కల్యాణోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. గోవింద నామ స్మరణలతో ఆ ప్రాంతం మార్మోగింది. 23 కౌంటర్లను ఏర్పాటు చేసి దాదాపు 10 వేల మందిపైగా భక్తులకు అన్నప్రసాద వినియోగం చేశారు. టీటీడీ కళాకారులు అన్నమాచార్య సంకీర్తనలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు టంగుటూరు మారుతిప్రసాద్, కొత్తపల్లె సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
● కల్యాణ వైభోగమే..


