కడప– బెంగళూరు రైల్వేలైన్ ప్రతిపాదనపై అఖిలపక్ష సమావేశం
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఇటీవల జరిగిన రైల్వే అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముద్దనూరు– ముదిగుబ్బ మీదుగా బెంగళూరుకు రైల్వే లైను నిర్మాణం జరపాలని చేసిన ప్రతిపాదనపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. శనివారం నగరంలోని సీపీఐ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కడప– బెంగళూరు రైలు మార్గంపై ఇదివరకే పెండ్లిమర్రి, రాయచోటి, మదనపల్లి మీదుగా ఒక ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. జిల్లాలో విస్తారంగా పండించే అరటి, మామిడి, చీనీ, బొప్పాయి, చామంతి పంటల ఎగుమతికి పెండ్లిమర్రి మీదుగా కడప– బెంగళూరు రైల్వే లైను నిర్మాణానికి 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రణాళిక రూపొందించారన్నారు. రూ.2వేల కోట్ల అంచనా వ్యయంతో 157 కిలో మీటర్ల మేర చేపట్టాల్సిన పనులను వైఎస్సార్ మరణానంతరం అటకెక్కించారన్నారు. అనుమతులున్న పాత ప్రాజెక్టుకు రూ. 2వేల కోట్లు కేటాయిస్తే రైల్వే పనులు పూర్తి చేయడానికి అవకాశం ఉన్నదన్నారు. కానీ ఆ దిశగా ఆలోచించకుండా కొత్త ప్రాజెక్టు ప్రతిపాదన తీసుకురావడంలోని ఆంతర్యమేమిటన్నారు. పాత ప్రాజెక్టుకు కేటాయించిన వందల కోట్ల నిధులు నిరుపయోగం కావాల్సిందేనా అని ప్రశ్నించారు. ఇలాంటి సందర్భాలలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా..
చెన్నూరు : శబరిమలకు వెళ్లి వస్తుండగా శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు గాయాల పాలయ్యారు. చెన్నూరుకు చెందిన నలుగురు కేరళ రాష్ట్రం శబరిమలలోని అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో ఘాట్ రోడ్డులో వర్షం వల్ల ట్రాక్టర్ అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో వారు నలుగురూ గాయపడ్డారు. వారిని అక్కడి పోలీసులు ఆస్పత్రికి తరలించారు. గాయపడిన సునీతకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మిగిలిన ముగ్గురికి ప్రాథమిక చికిత్స అందించి, డిశ్చార్జ్ చేశారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు.
నాకౌట్ దశకు సాఫ్ట్‌బాల్ పోటీలు
వీరవాసరం : వీరవాసరం ఎంఆర్కే జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న 69వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ అండర్ 17 సాఫ్ట్ బాల్ పోటీలు నాకౌట్ దశకు చేరుకున్నాయని పశ్చిమగోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి పీఎస్‌ఎన్ మల్లేశ్వరరావు, దాసరి సునీత తెలిపారు. రెండవ రోజు బాలికల పోటీలో వైఎస్సార్ కడప జట్టు శ్రీకాకుళం జట్టుపై 08:04 తేడాతో గెలుపొందింది. బాలికల క్వార్టర్ ఫైనల్ పోటీలో కడప జట్టు గుంటూరు జట్టుపై విజయం సాధించి సెమీఫైనల్‌లోకి ప్రవేశించింది. బాలుర పోటీలో కడప జట్టు కృష్ణా జిల్లా జట్టుపై 01–00 తేడాతో విజయం సాధించింది. బాలుర క్వార్టర్ ఫైనల్ పోటీలో గుంటూరు జట్టు కడప జట్టుపై గెలిచి సెమీఫైనల్‌లోకి ప్రవేశించింది.
చికిత్స పొందుతున్న మహిళ
చికిత్స పొందుతున్న బాలుడు
రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
కడప– బెంగళూరు రైల్వేలైన్ ప్రతిపాదనపై అఖిలపక్ష సమావేశం


