కిడ్నీరాకెట్‌.. రోజుకో మలుపు | - | Sakshi
Sakshi News home page

కిడ్నీరాకెట్‌.. రోజుకో మలుపు

Nov 25 2025 9:20 AM | Updated on Nov 25 2025 9:20 AM

కిడ్నీరాకెట్‌.. రోజుకో మలుపు

కిడ్నీరాకెట్‌.. రోజుకో మలుపు

కిడ్నీరాకెట్‌.. రోజుకో మలుపు

నిందితులుగా మరో 8 మంది

వెలుగులోకి కాకినాడలో

రాకెట్‌ మూలాలు

మదనపల్లె : మదనపల్లెలో ఈనెల 9న వెలుగుచూసిన కిడ్నీ రాకెట్‌ కేసు దర్యాప్తు మలుపు తిరుగుతోంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ కేసు మూలాలు కాకినాడకు పాకినట్టు దర్యాప్తులో తేలింది. అక్కడి దళారులు, ఇప్పటికే అరెస్టయిన నిందితులతో వారికున్న సంబంధాలపై ఆరా తీస్తుండగా కేసులో మొదటి నిందితుడైన డీసీహెచ్‌ఎస్‌ కంప ఆంజనేయులు కుటుంబీకుల్లో ఒకరిపై తాజాగా కేసు నమోదైనట్లు తెలిసింది. దీంతో దర్యాప్తు సాగుతున్నకొద్ది ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

మరో 8 మందిపై కేసు

ఈనెల 9న స్థానిక గ్లోబల్‌ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో రెండు కిడ్నీ ఆపరేషన్లు జరిగినట్టు నిర్దారణ అయ్యింది. కిడ్నీలు ఇచ్చిన వైజాగ్‌కు చెందిన ఇద్దరు మహిళల్లో సాడి యమున (29) మృతి చెందడంతో తల్లి సూరమ్మ ఫిర్యాదు మేరకు ఆంజనేయులు సహా ఏడుగురిపై కేసు నమోదు చేయడం తెలిసిందే. ఈ కేసులో అరెస్టయిన నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మరో 8 మందిని నిందితులుగా చేర్చగా వారి వివరాలు గోప్యంగా ఉంచారు. అయితే ఏ–1 నిందితుడు ఆంజనేయులు కుటుంబీకుల్లో ఒకరిపై కేసు నమోదైనట్లు తెలిసింది. మిగిలిన నిందితుల్లో కిడ్నీలు ఇచ్చేవారిని సేకరించడం, శస్త్రచికిత్సలు చేసిన యూరాలజీ డాక్టర్‌ పార్థసారధికి సహాయకులుగా పనిచేసిన ఇద్దరు, కేసులో సంబంధం ఉన్న వారు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ కేసులో నిందితుల సంఖ్య 15కు చేరింది. ఈ సంఖ్య ఇక్కడితో ఆగదని, ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీసులు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

కాకినాడలో మూలాలు

వైజాగ్‌కు చెందిన ఇద్దరు మహిళల కిడ్నీలు తీసి ఇద్దరికి అమర్చిన ఈ రాకెట్‌లో కాకినాడకు చెందిన ఓ మధ్యవర్తి వ్యవహారాన్ని విచారణ అధికారులు గుర్తించారని తెలిసింది. ఈ కేసులో అరెస్టయిన మధ్యవర్తులు పిల్లిపద్మ, కాకార్ల సత్యలతో ఇతనికి సంబంధాలు, ఎక్కడెక్కడ వీరు కలిశారు.. ఇంకా ఎన్ని కిడ్నీల మార్పిడిలో వీరి ప్రమేయం ఉంది అన్న వివరాలను ఆరా తీయడమేకాక కాకినాడకు చెందిన మధ్యవర్తి కోసం గాలిస్తున్నట్టు తెలిసింది. దీంతో కిడ్నీ రాకెట్‌ మూలాలు వైజాగ్‌లోనే కాకుండా కాకినాడలోనూ ఉన్నట్టు నిర్ధారించిన పోలీసులకు ఇతన్ని అరెస్ట్‌ చేస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి రావొచ్చని భావిస్తున్నారు.

వారంతా కడప వాసులే

కిడ్నీ రాకెట్‌ కేసులో ఏ–2గా ఉన్న బెంగళూరు డాక్టర్‌ వివరాలను దర్యాప్తు అధికారులు సేకరించారు. ఆ డాక్టర్‌ కడపకు చెందిన యూరాలజీ వైద్యుడు పార్థసారధిరెడ్డిగా గుర్తించారు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ సమయంలో ఆ డాక్టర్‌కు సహాయకులుగా ఉన్న ఇద్దరు కూడా కడప వారని గుర్తించారు. కడప నుంచి బెంగళూరు వెళ్లిన డాక్టర్‌ ఎనిమిదేళ్లుగా ఉంటున్నట్టు నిర్ధారించారు. సహాయకుల వివరాలు సేకరించిన పోలీసులు పూర్తిస్థాయిలో వివరాలను సేకరించేపనిలో ఉన్నారు. వీరు అరెస్ట్‌ అయితే ఆ డాక్టర్‌ ఎన్ని కిడ్నీ ఆపరేషన్ల చేశారు, ఎప్పటినుంచి మదనపల్లెలో ఈ రాకెట్‌ నడుస్తోందో వెలుగులోకి వస్తుంది.

ఒక్కో ఆపరేషన్‌కు రూ.5 లక్షలు

దర్యాప్తులో పోలీసులు సేకరించిన వివరాల మేరకు గ్లోబల్‌ హాస్పిటల్‌లో ఒక కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ జరిగితే యూరాలజీ డాక్టర్‌కు రూ.5 లక్షలు, డాక్టర్‌ ఆంజనేయులకు రూ.4 నుంచి రూ.5 లక్షల అద్దె చెల్లించేవారని తెలిసింది. ఈలెక్కను దాతలనుంచి తీసుకున్న కిడ్నీలకు తక్కువ మొత్తం చెల్లించి, మధ్యవర్తులు అధికసొమ్మును వాటాలు వేసుకునే వారని తెలుస్తోంది. గ్లోబల్‌ హాస్పిటల్‌లో కిడ్నీమార్పిడి ఆపరేషన్లు రెండే జరిగాయని, అదికూడా ఈనెల 9న చేసిందేనని నిందితులు చెబుతున్నట్టు తెలిసింది. పూర్తిస్థాయి దర్యాప్తు జరిగే వరకు దానికిముందు ఎన్ని ఆపరేషన్లు జరిగాయి, జరగలేదా అన్నది తేలాల్సి ఉంది. కాగా ఈనెల 9న ఇద్దరు మహిళల నుంచి తీసిన రెండు కిడ్నీలను గోవా, బెంగళూరుకు చెందిన వ్యక్తులకు అమర్చినట్టు గుర్తించిన పోలీసులు వారు ప్రస్తుతం ఆరోగ్యం కుదట పడేందుకు బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు గుర్తించినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement