పసికందును అమ్మేసిన తండ్రి | - | Sakshi
Sakshi News home page

పసికందును అమ్మేసిన తండ్రి

Apr 1 2026 8:42 AM | Updated on Apr 1 2026 8:42 AM

తాగుడుకు బానిసై.. డబ్బుల కోసం విక్రయం

బిడ్డ కోసం తల్లడిల్లుతున్న తల్లి

మైదుకూరు/వల్లూరు(చెన్నూరు) : పేదరికం, వ్యసనాలు రక్తసంబంధాలను తెంచి వేస్తున్నాయి. డబ్బు కోసం కన్న బిడ్డ అనే మమకారాన్ని కూడా కాదనుకుని కసాయిగా మారి ఓ కన్న తండ్రి 5 వారాల పసికందును రూ.50 వేలకు అమ్మేశాడు. కన్న బిడ్డ దూరం కావడంతో ఆ తల్లి తల్లడిల్లుతోంది. బాలింత సమస్యలతో బాధపడుతూ ఆ తల్లి మైదుకూరులోని అత్తమామల వద్దకు రావడంతో పసికందు విక్రయం సంఘటన మంగళవారం వెలుగు చూసింది. బాధితురాలు లక్ష్మీనారాయణమ్మ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చాపాడు మండలం సిద్ధారెడ్డిపల్లె ఎస్సీ కాలనీకి చెందిన లక్ష్మీనారాయణమ్మకు మైదుకూరుకు చెందిన దండు బాలకుమార్‌తో పదేళ్ల కిందట వివాహం జరిగింది. బేల్దారి పని చేసే బాలకుమార్‌ పెళ్లి అయిన ఏడాది బాగానే ఉన్నాడు. తర్వాత మద్యానికి బానిస అయ్యాడు. మద్యం తాగి వచ్చినప్పుడల్లా ఇంట్లో గొడవ చేసేవాడు. నాలుగేళ్ల కిందట డబ్బు కోసం ఉన్న ఇల్లును కూడా అమ్మేశాడు. సిద్ధారెడ్డిపల్లె ఎస్సీ కాలనీలో తన తల్లిదండ్రులకు చెందిన ఇల్లు ఉండటంతో లక్ష్మీనారాయణమ్మ భర్త పిల్లలతో అక్కడికి చేరింది. బాలకుమార్‌ తల్లిదండ్రులు జోజమ్మ, ఆరోగ్యం కూలి పనులు చేసుకుంటూ మైదుకూరులోనే ఉండిపోయారు. సిద్ధారెడ్డిపల్లెకు వెళ్లే సమయానికి లక్ష్మీనారాయణమ్మకు ఇద్దరు మగ పిల్లలు యశ్వంత్‌, సతీష్‌ ఉన్నారు. ఇటీవల ఆమె మూడోసారి గర్భం దాల్చింది. మైదుకూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో గత నెల 24న అమె మళ్లీ మగ బిడ్డకు జన్మనిచ్చింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకుంటానని అక్కడి వైద్యులకు చెప్పగా మైదుకూరు ఆస్పత్రిలో కు.ని. ఆపరేషన్లు చేయడం లేదని.. చెన్నూరు లేదా కడపకు వెళ్లాలని వారు చెప్పారు. రెండు వారాల కిందట లక్ష్మీనారాయణమ్మ చెన్నూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకుంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకునే వారికి ప్రభుత్వ ప్రోత్సాహకం కింద ఇచ్చే నగదు గురించి మాట్లాడుదామంటూ సోమవారం బాలకుమార్‌ భార్య, తల్లి జోజమ్మను తీసుకొని చెన్నూరు ఆస్పత్రికి వెళ్లాడు. అత్తా కోడళ్లు పసికందుతో ఆస్పత్రిలో కూర్చుని ఉండగా ఆస్పత్రి సిబ్బందిలో ఓ వ్యక్తి రూ.50 వేలు తీసుకుని వచ్చి జోజమ్మ చేతిలో పెట్టి లక్ష్మీనారాయణమ్మ ఒడిలో ఉన్న పసికందును తీసుకొని వెళ్లాడు. తర్వాత బాలకుమార్‌ భార్య తల్లి వద్దకు వచ్చి బిడ్డ గురించి ఏడ్చినా, ఎవరికై నా చెప్పినా ఇద్దరినీ చంపేస్తానని బెదిరించాడు. ఆ వెంటనే తల్లి చేతిలో ఉన్న రూ.50 వేలను తీసుకుని మీరు ఇంటికి వెళ్లండి తాను రాత్రికి వస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. జోజమ్మ కోడలిని తీసుకుని మైదుకూరుకు వచ్చి అక్కడ ఆటోలో ఆమెను సిద్ధారెడ్డిపల్లెకు పంపి, తాను ఇంటికి వెళ్లిపోయింది. రెండు రోజులుగా బిడ్డకు పాలు ఇవ్వకపోవడం, బిడ్డ గుర్తుకు రావడంతో లక్ష్మీనారాయణమ్మ ఏడ్చుకుంటూ మైదుకూరులోని ప్రొద్దుటూరు రోడ్డులో అద్దె ఇంట్లో ఉంటున్న అత్తమామల వద్దకు వచ్చింది. అత్తమామలు, లక్ష్మీనారాయణమ్మ రోదిస్తూ బిడ్డ గురించి మాట్లాడుకుంటుండగా పసికందు విక్రయం గురించి అందరికీ తెలిసింది. ఐసీడీఎస్‌ అధికారులకు సమాచారం అందడంతో మైదుకూరు పట్టణం సూపర్‌వైజర్‌ ప్రశాంతి.. జోజమ్మ ఇంటి వద్దకు చేరుకుని బాధిత పసికందు తల్లి లక్ష్మీనారాయణమ్మను విచారణ చేసి వివరాలను తెలుసుకున్నారు. సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నుట్ట సూపర్‌వైజర్‌ తెలిపారు.

చెన్నూరు ఆస్పత్రి వైద్యులే మధ్యవర్తులా..

మూడోసారి మగ బిడ్డకు జన్మనిచ్చిన లక్ష్మీనారాయణమ్మ కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ కోసం చెన్నూరు ఆస్పత్రికి వెళ్లిన సమయంలోనే ఆమె భర్త బాలకుమార్‌ పసికందును విక్రయించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఆ విషయం ఆస్పత్రి వద్ద పాలను విక్రయిస్తున్న ఓ మహిళకు చెప్పడంతో ఆమె.. అక్కడి సిబ్బంది ద్వారా వైద్యురాలికి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. చెన్నూరులో విధులు నిర్వహిస్తున్న ప్రొద్దుటూరుకు చెందిన ఆ వైద్యురాలు మరో వైద్యురాలితో మాట్లాడి డీల్‌ కుదిర్చినట్టు సమాచారం. వారంతా కలిసి ప్రొద్దుటూరుకు చెందిన కొందరికి శిశువును అప్పగించినట్టు తెలుస్తోంది. పిల్లలు లేని జంటకు విక్రయించారా లేక పిల్లల్ని విక్రయించే రాకెట్‌ నడుపుతున్న వారికి విక్రయించారా అనే విషయాన్ని అధికారులు, పోలీసులే తేల్చాల్సి ఉంది.

అధికారుల వివరణ

ఈ విషయంపై సామాజిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న డాక్టర్‌ శివకుమార్‌ను సాక్షి వివరణ కోరగా.. తాను సెలవుల్లో ఉన్నానని, తనకు ఏమీ తెలియదని సమాధానమిచ్చారు. సామాజిక ఆరోగ్య కేంద్రం గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ హర్షారెడ్డిని అడగగా.. మార్చి 17వ తేదీన కుటుంబ నియంత్ర ఆపరేషన్‌ చేయించుకున్నారని, 24వ తేదీన తిరిగి కుట్లు విప్పుటకు రావాల్సి ఉందని, అంత వరకు తనకు తెలుసు అని, మిగతా విషయాలు తనకు ఏమీ తెలియని సమాధానం ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement