బద్వేలు అర్బన్ : కోర్టులో నడుస్తున్న ఓ ఆస్తి వివాదంలో పట్టణానికి చెందిన ఓ జనసేన నేత జోక్యం చేసుకుని హల్‌చల్ చేశాడు. సదరు ఇళ్లలో అద్దెకు ఉంటున్న వారిపై జులుం ప్రదర్శించాడు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని రాధాకృష్ణనగర్ సమీపంలో గల రాధాకృష్ణ కల్యాణ మండపం, మరికొన్ని ఇళ్లకు సంబంఽధించి ఇరువర్గాల మధ్య వివాదం కోర్టులో నడుస్తోంది. అయితే ఇటీవల కాలంలో ఇరువర్గాలు సమస్య సృష్టిస్తుండటంతో పెద్ద మనుష్యులు జోక్యం చేసుకుని కల్యాణ మండపానికి ఇరువురు కలిసి తాళం వేసుకునేలా ఒప్పందం చేశారు. కోర్టులో వివాదం తెగే వరకు ఎవరూ అందులోకి ప్రవేశించకూడదని నిర్ణయించారు. అయితే ఇటీవల కాలంలో ఓ వర్గానికి చెందిన వ్యక్తులు కల్యాణ మండపం పరిసరాల్లోకి ఇళ్ల వద్దకు వెళ్లి అద్దెకు ఉంటున్న వారిని ఇళ్లు ఖాళీ చేసి వెళ్లాలని భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో ఇప్పటికే నాలుగు కుటుంబాల వారు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్న సమయంలో జనసేన పార్టీకి చెందిన దద్దం నాగార్జున అనే వ్యక్తి సదరు కల్యాణ మండపం సమీపంలోని ఓ ఇంటి తాళాలు పగులకొట్టేందుకు యత్నించాడు. ఈ సమయంలో మరో వర్గానికి చెందిన వ్యక్తులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో చుట్టుపక్కల వారు సర్దిచెప్పడంతో జనసేన నేత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై అర్బన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఒక వర్గానికి చెందిన భాస్కర్ తెలిపాడు.
సబ్ రిజిస్ట్రార్‌తోపాటు మరో ఇద్దరు సస్పెన్షన్
లక్కిరెడ్డిపల్లి : లక్కిరెడ్డిపల్లి సబ్ రిజిస్ట్రార్ సి.రామాంజులతోపాటు గతంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేసిన ఎ.సురేష్, ప్రస్తుత జూనియర్ అసిస్టెంట్ బి.ప్రశాంతిలను సస్పెండ్ చేస్తూ మంగళవారం కడప రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ రామలక్ష్మీ పట్నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. 22ఏ పరిధిలోని నిషేధిత జాబితాలో ఉన్న భూములను డబ్బులు తీసుకొని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ కమిషనర్, ఐజీ ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీలో బట్టబయలు కావడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. తంబళ్లపల్లిలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఉదయ్ కిరణ్‌రెడ్డిని లక్కిరెడ్డిపల్లి ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
● ఇరు వర్గాల ఆస్తి వివాదంలో జోక్యం
● ఓ ఇంటి తాళం పగులగొట్టే యత్నం


