తొండూరు : తొండూరు మండల పరిధిలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. మల్లేల గ్రామంలో మంగళవారం రాత్రి 7.45 గంటలకు షేక్ బీబీ (56), ఆమె కుమార్తె షేక్ ఇమామ్‌బీ (33)లు తమ ఇంటిలోని ఫ్యాన్లకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తండ్రి షేక్ ఇమామ్‌బాషా ఇంటిలో కనిపించకుండా పోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే అప్పుల బాధతోనే తల్లీకూతురు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఆటో బోల్తా..
డ్రైవర్‌కు గాయాలు
సిద్దవటం : సిద్దవటం– భాకరాపేట ప్రధాన రహదారి అయ్యప్పస్వామి గుడి సమీపాన భాకరాపేట నుంచి సిద్దవటంకు ఆటో నడుపుకొంటూ వస్తుండగా ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి అదుపు తప్పి మంగళవారం సాయంత్రం ఆటో బోల్తా పడింది. ఆటో డ్రైవర్ భవనాసి వెంకటేష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఆయనను వైద్యసేవల కోసం కడప రిమ్స్‌కు తరలించామని స్థానికులు తెలిపారు.
ఏపీఎస్‌పీడీసీఎల్‌లో పదోన్నతులు
కడప కార్పొరేషన్ : ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(ఏపీఎస్‌పీడీసీఎల్)లో పలువురికి పదోన్నతులు కల్పిస్తూ ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి ఉత్తర్వులు జారీ చేశారు. కడప సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్‌గా పని చేస్తున్న ఎస్.రమణకు సీజీఎంగా పదోన్నతి కల్పించి తిరుపతి కార్పొరేట్ ఆఫీసు కొనుగోళ్ల విభాగానికి బదిలీ చేశారు. ఓఅండ్‌ఎం విభాగంలో చీఫ్ జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్న ఎం.క్రిష్ణారెడ్డి మార్చి 31వ తేదికి పదవీ విరమణ చేయడంతో ప్లానింగ్ విభాగం చీఫ్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న కె.సంపత్ కుమార్‌ను ఆ స్థానానికి బదిలీ చేశారు. కార్పొరేట్ ఆఫీసులో ఎనర్జీ ఆడిట్ విభాగంలో జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎస్. శ్రీనివాసులును కడప ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈగా బదిలీ చేశారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా పని చేస్తున్న రవి చంద్రశేఖర్, షేక్ చాంద్‌బాష, ఎస్.రామక్రిష్ణలకు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా, అసిస్టెంట్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న ఎం.కవిత, ఎస్.అశోక్ కుమార్, బి.రవి కుమార్‌లకు డీఈఈలుగా పదోన్నతి కల్పించారు.


