రాజంపేట : చెయ్యేరు నదిని తెలుగుదేశం పార్టీ నేతలు చెరబట్టారు. నిబంధనలు ఉల్లంఘించి జోరుగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ముఖ్యంగా రాజంపేట–రాయచోటి మార్గంలోని బాలరాచపల్లెలో నిబంధనలు ఉల్లంఘించి ఇసుక దోపిడీ చేస్తున్నారు. ఎంచక్కా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ జేబులు నింపేసుకుంటున్నారు. కాగా చెయ్యేరు నుంచి ఇసుక తరలిస్తున్న వాహనాలను రాజంపేట పోలీసులు గత శనివారం రాత్రి పట్టుకున్నారు. ఎలాంటి పత్రాలు లేని వాహనాల్లో ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించి 12 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మన్నూరు సీఐ లింగప్ప తన సిబ్బందితో ఇసుక టిప్పర్ల తరలింపును అడ్డుకున్నారు. వాటిని సంబంధిత శాఖ అధికారులకు అప్పగించారు.
ఇసుక టిప్పర్లను విడిపించేందుకు ఓ మంత్రి ప్రయత్నం
ఇసుక టిప్పర్లను విడిపించేందుకు ఇన్‌చార్జి హోదాలో ఓ మంత్రి విశ్వప్రయత్నం చేసినట్లు సమాచారం. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా వాహనాలను పట్టుకోవడంతో టీడీపీ వర్గాల్లో సంచలనం కలిగించింది. పోలీసు ఉన్నతాధికారిపై కూడా ఒత్తిడి తీసుకొచ్చారనే వాదనలు బయటికివచ్చాయి.
జిల్లాకు చెందిన మంత్రి అనుచరులే..
బాలరాచపల్లె హైలెవల్ వంతెన సమీపంలో ఇటాచీ పెట్టి మరీ అడ్డగోలుగా ఇసుకను తరలిస్తుండడంపై కొన్ని నెలలుగా తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. అయినా అధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడు పట్టుబడిన ఇసుక టిప్పర్లు జిల్లాకు చెందిన మంత్రి అనుచరులేనని తెలుస్తోంది.
పరీవాహక ప్రాంత వాసులు ఆందోళన
నియోజకవర్గలోని చెయ్యేరు నదిని పచ్చతోడేళ్లు చుట్టుముట్టడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలంలో భూగర్భ జల సమస్య ఉత్పన్నమయ్యే పరిస్ధితులు వస్తాయని చెయ్యేరు నదీ పరీవాహక ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


