● మూడు సీజన్లు పూర్తయినా పైసా కూడా...
కడప అగ్రికల్చర్: చంద్రబాబు ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేసింది. వ్యవసాయానికి కనీ సం కూడా సహకారం అందించకుండా వేధిస్తోంది. అన్నదాతలకు భరోసా కల్పించే ఫసల్ బీమాను నీరు కార్చేందుకు ప్రయత్నిస్తోంది. కష్టకాలంలో కర్షకులకు వెన్నుదన్నుగా నిలిచే పథకాలకు తూట్లు పొడుస్తోంది. ఈ క్రమంలోనే రబీకి సంబంధించి ఇప్పటివరకు బీమా ప్రీమియం చెల్లింపులపై స్పష్టత ఇవ్వకుండా మీనమేషాలు లెక్కిస్తోంది. దీనికితోడు రబీ సీజన్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఈ క్రాపు నమోదు కూడా ప్రారంభించలేదు. మరోవైపు వరుస వర్షాలు.. తుపాన్లు రైతు కష్టాన్ని మింగేస్తున్నాయి.
ఆరుకాలం కష్టించే అన్నదాతలకు.....
కూటమి ప్రభుత్వంలో అన్నదాతలు అడుగడుగునా దగా పడుతున్నారు. ప్రభుత్వానికి తోడు ప్రకృతి వైపరీత్యాలు కర్షకులను మరింత కుంగదీస్తున్నాయి. సెప్టెంబర్, అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలతోపాటు మొన్నొచ్చిన మోంథా తుపాన్ రైతులను నట్టేట ముంచింది. ఖరీఫ్ సీజన్‌కు రైతులు ప్రీమియం చెల్లించినా ఆ పంటలకు సంబంధించిన నష్టపరిహారంపై ఇప్పటికీ స్పష్టత లేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం స చిత్తశుద్ధితో వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలిచింది. రైతుల ఆర్థికాభివృద్దికి అడుగడుగునా చేయూతనిచ్చింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గతంలో అన్నదాతలకు ఉచితంగా అందిన పంటల బీమా పథకాన్ని ఇప్పుడు అనుచితంగా మార్చేసింది. కనీసం రబీకి సంబంధించి ఏ పంటకు ఎంత ప్రీమియం కట్టాలో కూడా ఇంతవరకు వెల్లడించలేదంటే రైతులపై బాబు సర్కారుకున్న ప్రేమ ఇట్టే అర్థమవుతోంది.
రబీ సీజన్‌కు ముందే...
సీజన్ ప్రారంభానికి ముందే బీమా ప్రీమియం లెక్కలు స్పష్టం చేయాలి. రబీ సీజన్ ప్రారంభమై నెలన్నర దాటినా ఇంతవరకు అతీగతి లేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వాతావరణ అధారిత, పంటల దిగుబడి బీమా ప్రీమియం మొత్తాన్ని రైతు లు చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే చెల్లించేది, దీంతో అన్నదాతలకు భారం పడకుండా ఉండేది. దీంతోపాటు పంటల ఈ క్రాపుతోపాటు ఈకేవైసీ కూడా సకాలంలో పకడ్బందీగా పూర్తి చేసేది. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఈ క్రాపు నమోదు ఇంకా ప్రారంభించలేదు. పైకేమో రైతన్నా నీకోసమంటూ మాయమాటలు చెబుతూ కాలం గడిపేస్తోంది.
గత ఖరీఫ్ సీజన్‌లో చంద్రబాబు ప్రభుత్వం వరిపంటకు సంబంధించి ఎకరాకు రూ. 630, వేరుశనగకు ఎకరాకు రూ.450, మామిడికి ఎకరాకు రూ. 1750 చొప్పున రైతుల నుంచి ప్రీమియం కట్టించింది. అయితే బాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన 2024 జూలై 12 నుంచి 2025 మే వరకు మూడు సీజన్లు పూర్తి అయ్యాయి. బీమా ప్రీమియం చెల్లించినా రైతులకు మాత్రం పంటలకు నష్ట పరిహారం కింద ఇప్పటివరకు ఒక్క పైసా కూడా చెల్లించలేదు. ఇటీవల వరుస తుపాన్‌లతోపాటు వర్షాలకు పంటల దెబ్బతిన్న రైతులేమో పరిహారం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.


